రోజూ.. తాగునీరు
● నీటి సరఫరాకు ట్రయల్ రన్ ● దశలవారీగా విస్తరణకు చర్యలు ● బల్దియాలో 13 వాటర్ ట్యాంకులు ● నాలుగింటి పరిధిలో డెయిలీ వాటర్ ● ‘ఎల్లంపల్లి’ ద్వారా ప్రతీరోజు 45 ఎంఎల్‌డీ నీరు సరఫరా ● పర్యవేక్షిస్తున్న రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ
రామగుండం నగర సమాచారం
డివిజన్లు 50 విస్తీర్ణం(చ.కి.మీ.) 93.47 జనాభా 2,29,644 నివాసాలు 50,956 నల్లా కనెక్షన్లు 40,728
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగర వాసులకు నల్లాల ద్వారా ప్రతీరోజూ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. నాలుగు వాటర్ ట్యాంకుల పరిధిలో ప్రతీరోజు తాగునీటిని అందిస్తారు. ఇప్పటివరకు రోజు విడిచి రోజు రక్షిత నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతమైతే.. భవిష్యత్‌లో మరిన్ని వాటర్ ట్యాంకుల పరిధిలో కూడా రోజూ తాగునీటి సరఫరా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
నగరంలో 13 వాటర్ ట్యాంకులు..
నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 13 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. రామగుండం, భీమునిపట్నం, ఎన్టీపీసీ హెలిప్యాడ్, శారదనగర్, అశోక్‌నగర్, సంజయ్‌గాంధీనగర్, ఓల్డ్ మున్సిపల్ బ్యాంక్, సీఎస్పీ ట్యాంక్, వెటర్నరీ ఆస్పత్రి ట్యాంక్, విఠల్‌నగర్, ఎలుకలపల్లి, న్యూమారేడుపాక, అల్లూరు పరిధిలోని వాటర్ ట్యాంకుల ద్వారా నగరవాసులకు తాగునీరు అందిస్తున్నారు.
నాలుగు ట్యాంకుల పరిధిలో ట్రయల్ రన్..
ప్రతీరోజు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు నగరంలోని నాలుగు వాటర్ ట్యాంకులను అధికారులు ఎంపిక చేశారు. భీమునిపట్నం, ఎన్టీపీసీ హెలిప్యాడ్, ఎల్కలపల్లి, న్యూ మారేడుపాక ట్యాంక్‌లను ఎంపికచేసిన అధికారులు.. వాటి ద్వారా వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
ఎల్లంపల్లి నుంచి 45 ఎంఎల్‌డీ సరఫరా..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నగరానికి వారం క్రితం వరకు 40 మిలియన్ లీటర్స్ పర్ డే(ఎంఎల్‌డీ) తాగునీరు సరఫరా చేసేవారు. అయితే, ట్రయల్ రన్ కోసం ప్రతీరోజు నాలుగు వాటర్ ట్యాంకుల పరిధిలో మంచి నీటిని సరఫరా చేస్తుండడంతో ఇందుకు అవసరమైన 5 ఎంఎల్‌డీ నీటిని అదనంగా ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటున్నారు. మొత్తం కలిపి రోజూ 45 ఏంఎల్‌డీ నీరు అవసరమతోంది.
పర్యవేక్షిస్తున్న కమిషనర్..
ప్రతీరోజు తాగునీటిని సరఫరా చేస్తున్న ట్రయల్ రన్‌పై బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ప్రాంతాలను కమిషనర్ నేరుగా సందర్శిస్తున్నారు. ఆయా కాలనీల్లో పర్యటిస్తూ స్థానికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు.
సరిపడా అందిస్తాం
నగరంలో తాగునీటి సరఫరా మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం నాలుగు వాటర్ ట్యాంకుల పరిధిలో ప్రతీరోజు 45 నిమిషాలపాటు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాం. ప్రెషర్ తక్కువగా ఉండటం తదితర ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతా ల్లో మరో మూడు వాటర్ ట్యాంకులు నిర్మించడానికి అంచనాలు తయారు చేస్తున్నాం. ప్రతీరోజు సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో మీటర్లు ఏర్పాటు చేస్తాం. సమస్యలు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
– అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్‌ఏసీ), రామగుండం
రోజూ.. తాగునీరు


