
గోదావరిఖని: రెండు జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి చేపట్టే ఓట్ల లెక్కింపునకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రెండు కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. పెద్దపల్లి జిల్లాలో మంథని జేఎన్‌టీయూలో మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలు, మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, మంచిర్యాల జిల్లా ఐజా కళాశాలలో బెల్లంపల్లి నియోజకవర్గాల కౌంటింగ్ కొనసాగుతుందన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
సాక్షి: కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
సీపీ: పాస్‌లేని వారిని లోనికి అనుమతించేది లేదు. అక్కడ మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశాం. తొలిదశలో ఒక కంపెనీ కేంద్ర బలగాలు, రెండోదశలో రాష్ట్ర రిజర్వ్‌డ్, మూడోదశలో స్థానిక పోలీసులను నియమిస్తాం. రిటర్నింగ్ అధికారి జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు భద్రత సిబ్బందికి చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.
సాక్షి: ఎలాంటి నిబంధనలు విధించారు?
సీపీ: ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. గుమికూడితే కేసులు నమోదు చేస్తాం. ర్యాలీలు, సభలకు అనుమతి లేదు.
సాక్షి: ఉద్రిక్తతల నివారణకు తీసుకునే చర్యలు ఏమిటి?
సీపీ: ఫలితాల తర్వాత అన్నిప్రాంతాల్లో ఏరియా డామినేషన్ బృందాల నిఘా ఉంటుంది. అల్లర్లు, ఆందోళనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కౌంటింగ్ కేంద్రాలకు కిలోమీటరు రేడియస్ వరకు ప్రజలు గుమికూడవద్దు.
సాక్షి: కౌంటింగ్ కేంద్రాల్లో విధించిన షరతులు ఏమిటి?
సీపీ: కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో టపాసులు కాల్చవద్దు. మొబైల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, లైటర్ల వంటి నిషేధిత వస్తువులను కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లరాదు.
సాక్షి: గెలుపొందిన అభ్యర్థుల ర్యాలీలకు అనుమతి ఉందా?
సీపీ: గెలుపొందిన అభ్యర్థులు డిసెంబర్ 3న విజయోత్సవ ర్యాలీలు నిషేధం. విజేతలు పోలీస్ అధికారుల నుంచి రాతపూర్వకంగా కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. పోలీసులు, రెవెన్యూ, కౌంటింగ్ సిబ్బందికి అందరూ సహకరించాలి.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
ఏరియా డామినేషన్ బలగాల ఏర్పాటు
24గంటల పాటు 144సెక్షన్ అమలు
ర్యాలీలు, సభలకు అనుమతి నో
రామగుండం సీపీ రెమా రాజేశ్వరి
