
పేదల చుట్టం భూ భారతి
పెద్దల చట్టం ధరణి..
● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● ముప్పిరితోటలో భూ భారతి చట్టంపై సదస్సు
సాక్షి, పెద్దపల్లి: పెద్దల చట్టం ధరణి అయితే.. పేదల చుట్టంగా భూ భారతి పోర్టల్‌ను తీసుకోచ్చామని, కోర్టులో లేనిప్రతీ భూసమస్యను పరిష్కరించడమే భూ భారతి ముఖ్య ఉద్దేశమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట లో మంగళవారం భూ భారతి చట్టం – 2025పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలోని పెద్దలు నాలుగు గోడల మధ్య ధరణి చట్టం తయారు చేశారన్నారు. తమ ప్రభుత్వం 18 రాష్ట్రాల్లోని 20 చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వేలమంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని భూ భారతి తయారు చేసిందన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ, వీఆర్‌ఏ, వీఆర్‌వో వ్యవస్థలను కుప్పకూల్చిందని, ప్రజాప్రభుత్వంలో గ్రామానికో రెవెన్యూ అధికా రిని జూన్ 2వ తేదీ నాటికి నియమిస్తామన్నారు. కర్ణాటక విధానాలను అనుసరిస్తూ మండల కేంద్రాల్లో 6వేల లైసెన్స్‌డ్ ప్రైవేటు సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణిలో సమస్య వస్తే కోర్టుకు వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం ఆ అవసరం లేకుండా తహసీల్దార్ నుంచి సీసీఎల్‌ఏ వరకు ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీఎల్‌ఏ స్థాయిలో న్యాయం జరగకపోతే ప్రజలు కొత్తగా ఏర్పడిన ట్రిబ్యునల్‌ను సంప్రదించ వచ్చని, రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. భారతదేశ సరిహద్దుల అంశంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ అమెరికా నాయకత్వాన్ని ఎదిరించి పాకిస్థాన్‌ను యుద్ధంలో చిత్తుచేసి ప్రత్యేకంగా బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేశారని, నేడు అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రధానమంత్రి మోదీ రాజీపడటం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
హామీలన్నీ అమలు చేస్తున్నాం
ఎలిగేడు(పెద్దపల్లి): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమ లు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ముప్పిరితోటలో ఆయన మాట్లాడు తూ, కోతల్లేకుండా, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా అసత్యప్రచారం చేస్తూ ప్రజల ను తప్పుదోవపట్టిస్తున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వాటికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిచారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ అంత ర్గాం కాందీశీకుల భూసమస్యలను పరిష్కరించా లని మంత్రులు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబుకు వి న్నవించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తొలిబిల్లు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్లు ప్రకాశ్‌రావు, గండు సంజీవ్, స్వరూప, సింగిల్‌విండో చైర్మన్లు వేణుగోపాల్‌రావు, విజయభాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పేదల చుట్టం భూ భారతి