
కూడళ్ల విస్తరణే పరిష్కారం
● కలెక్టర్ ఆదేశాలతో అధికారుల్లో కదలిక ● పనులు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలి. ట్రాఫిక్, పోలీసు, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి. – కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరుగుతోంది. ప్రధానంగా కలెక్టరేట్, రంగంపల్లి, చీకురాయిక్రాస్ రోడ్డు, కమాన్, కూనారం క్రాస్‌రోడ్డు, ప్రగతినగర్, బస్టాండ్ జంక్షన్ల వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కమాన్ వద్ద వాహనాల రాకపోకలకు చాలాఇబ్బందిగా మారడంతో వీలైనంత వరకు రోడ్డును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెట్లు, స్తంభాలను తొలగించి వాహనాల రాకపోకలు సులువుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రమాదాల బస్టాండ్ కూడలి..
బస్టాండ్ కూడలి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నా.. వాహనదారుల్లో అవగాహన లేక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బస్టాండ్ క్రాస్‌రోడ్డు వద్ద రహదారిని దాటేందుకు యత్నించిన పట్టణానికి చెందిన వ్యాపారి యాద రమణయ్య, కాంట్రాక్టర్ గంట నర్సయ్య తమ ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఇంకొందరు త్రుటిలో ప్రమాదాల నుంచి సురక్షితంగా బయ టపడ్డ సంఘటనలు అనేకంగా ఉన్నాయి.
కష్టాల కూడలి ‘కమాన్’
పట్టణంలోని ప్రధాన కూడలి కమాన్. దీనివద్ద అవసరమైనంత స్థలం లేదు. వాహనదారులు, పాదచారులు రోడ్డు దాటేందుకు నానాకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నా.. వాహనాలను కట్టడి చేసేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. తాత్కాలిక డివైడర్లను ఏర్పాటు చేసి ఇబ్బందులు దూరం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన యత్నాలు సత్పలితాలు ఇవ్వడంలేదు. కొద్దిరోజుల క్రితం ఓ లారీ వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతేకాకుండా కమాన్ నుంచి వచ్చే వారు, యూటర్న్ తీసుకునే వాహనదారులు, నేరుగా గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారుల మధ్య సమన్వయం కుదరక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని నియంత్రించేందుకు పోలీసులు వీలైనంత వరకు విస్తరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అఽధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచిచూడాల్సిందే.

కూడళ్ల విస్తరణే పరిష్కారం