
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఊరట
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాస్త ఊరట లభించింది. బిల్లులు విడుదలకాక ఇబ్బంది పడుతున్న వారికి అధికారులు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రభుత్వం సూచించిన 600 చదరపు అడుగులకు మించి ఇల్లు నిర్మించబోమని అంగీకారపత్రం అందజేస్తే బిల్లు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా జిల్లాలో ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతుందని భావిస్తున్నారు. తొలివిడతలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికోసం ప్రభుత్వం రూ.5లక్షల వరకు సాయం చేస్తామని ప్రకటించింది. ఈక్రమంలో 400 చ.అ. నుంచి 600 చ.అ. విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు అందరికీ తొలివిడతలో రూ.లక్ష చొప్పున వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో అధికారులు ఇటీవల జమచేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం ఆకృతిని తమకు నచ్చిన విధంగా మార్పు చేసుకోవచ్చని ప్రభుత్వం వివరించింది. అయితే, విస్తీర్ణం మాత్రం పెంచకూడదనే నిబంధన విధించింది. లబ్ధిదారురుకు ఐదు విడతల్లో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు సాయం చేస్తుంది. ఇంటి విస్తీర్ణం పెంచితే ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ప్రకటిస్తామని సర్కారు హెచ్చరించింది.
జిల్లాలో మరో 38 మంది లబ్ధిదారులు
జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అధికారులు.. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 138 ఇళ్లు పూర్తికాగా.. బేస్మెంట్‌స్థాయి వరకు నిర్మించిన మ రో 100 ఇళ్లకు రూ.లక్ష చొప్పున విడుదల చేశారు. మరో 38 మంది 600 చదరపు అడుగులు దాటి బే స్మెంట్ కట్టారు. వీరి కోసం బిల్లులు మంజూరు చే యాలంటూ గతనెల 24న కలెక్టర్ కోయ శ్రీహర్ష.. హౌసింగ్ పీడీ రాజేశ్వర్ ద్వారా నివేదిక తెప్పించుకొని రాష్ట్రప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం వారికి రూ.38 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇకనుంచి లబ్ధిదారులు 400 చ.అ. నుంచి 600 చ.అ. విస్తీర్ణం లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.