
ఓటమిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం
● రాచరిక పాలనకు అలవాటుపడిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ● పోలీసులతో భయభ్రాంతులకు చేసింది నిజం కాదా? ● 15 నెలల కాంగ్రెస్ పాలనపై అక్కసు ఎందుకు? ● నిలదీసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మారం(ధర్మపురి): ఎమ్మెల్యేగా, మంత్రిగా సు మారు రెండు దశాబ్దాల పాటు రాచరిక, రాక్షస పా లన సాగించిన కొప్పుల ఈశ్వర్.. ఇప్పుడు ఓటమి ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా కొనసాగిన సమయంలో ఈశ్వర్ తనకు నచ్చని, ఎదురుతిరిగిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తనపై ఈశ్వర్ అనేక కేసులు పెట్టించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసి, కేసులు నమోదు చేయించిన ఘనత ఉన్న ఈశ్వర్ నీతులు మాట్లాడడం విడ్డూరమన్నారు. 2003 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగి ఏం అభివృద్ధి చేశావో బహిరంగ చర్చకు రావాలని లక్ష్మణ్‌కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రమంత్రిగా కొనసాగిన హరీశ్‌రావు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ధర్మపురి నియోజకవర్గంలో మంత్రిగా కొనసాగిన ఈశ్వర్ చేసిన అభివృద్ధి పనుల్లో తేడాను చూసేందుకు ముందుకు వస్తే ఇరుపార్టీల వారిని తీసుకెళ్తానని, ఇందుకు కోసం తానే స్వయంగా బస్సులు సమకూర్చుతానని అన్నారు. నందిమేడారం రిజర్వాయర్ నుంచి నీటిని సిద్దిపేట, గజ్వేల్ తరలిస్తుంటే కనీసం ప్రశ్నించలేని ఈశ్వర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అప్పటి మంత్రులుగా హరీశ్‌రావు, కేటీఆర్ వారి ప్రాంతాల అభివృద్ధికి పాటుపడితే ఈశ్వర్ అభివృద్ధిని విస్మరించి జల్సాల కోసం సమయాన్ని కేటాయించారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన రూ.వేల కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు కేటాయిస్తే ఏ ప్రయోజనం కోసం మౌనంగా ఉన్నారని ఈశ్వర్‌ను నిలదీ శారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, అసోద అజయ్, సోగాల తిరుపతి, కొడారి అంజన్న, కొత్త నర్సింహులు, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, అష్ష్యు, కాంసాని ఎల్లయ్య పాల్గొన్నారు.