● ఒకే విద్యార్థితో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల
గురువు
విద్యార్థి
పార్వతీపురం రూరల్: ఆ పాఠశాలలో అక్షరం ఒంటరైంది. పలకపట్టే పసివాడొక్కడే, దిద్దించే గురువొక్కడే కావడంతో ఆ విద్యాప్రాంగణం వెలవెలబోతోంది. పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలోని రెడ్డి వీధిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇది. ఈ బడిలో ప్రస్తుతం ఉపాధ్యాయుడు గౌరినాయుడు విధులు నిర్వర్తిస్తుండగా.. మేకల అరవింద్ (రెండవ తరగతి) అనే ఒకే ఒక్క విద్యార్థి విద్యాభ్యాసం చేస్తున్నాడు. గతేడాది విద్యా సంవత్సరంలో ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. ఈ పాఠశాలలో కేవలం రెండవ తరగతి వరకే బోధన ఉండడంతో, మూడవ తరగతికి వచ్చిన మరో విద్యార్థి వేరే బడికి వెళ్లాడు. దీంతో అరవింద్ ఒక్కడే మిగిలాడు. రెండేళ్ల క్రితం వరకు సరిపడా విద్యార్థులతో కళకళలాడిన ఈ బడిలో, క్రమంగా పిల్లల సంఖ్య పడిపోవడం గమనార్హం. నానాటికీ హాజరు క్షీణించి, బడిలో పిల్లాడొక్కడే మిగలడంతో గ్రామస్తుల్లో గుబులు మొదలైంది. పాఠశాలలో ఒక్కగానొక్క విద్యార్థే ఉన్న దృష్ట్యా. ఎక్కడ ప్రభుత్వం తమ వీధిలోని బడిని మూసివేస్తుందోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


