శ్రీమద్‌ రమారమణ గోవిందా హరి | - | Sakshi
Sakshi News home page

శ్రీమద్‌ రమారమణ గోవిందా హరి

Aug 31 2026 1:20 AM | Updated on Aug 31 2026 1:20 AM

శ్రీమద్‌ రమారమణ గోవిందా హరి ప్రేక్షకులు పారవశ్యం

వారసత్వంగా హరికథను పుచ్చుకున్నాం

నేడు హరికథా పితామహుడి 162వ జయంతి

విజయనగరం క్రైమ్‌:

చేతిలో చిడతలు..కాలికి గజ్జెలు..గంభీరమైన స్వరం.. సంగీతం, సాహిత్యం, నృత్యం వేళవింపుతో పధ్నాలుగేళ్ల ప్రాయంలో హరికథా గానం చేసిన ఓ వ్యక్తి హరికథా పితామహుడిగా ఖ్యాతి నొందారు. ఆయనే ఆదిభట్ల నారాయణ దాసు. శాటిలైట్‌, టెలిఫోన్‌ వంటి సాంకేతిక పరిజ్ఙానం లేని 1800వ శతకంలో తన 14వ ఏట ఆదిభట్ల నారాయణ దాసు తన గాన మాధుర్యంతో హరి కథలను చెప్పడం మొదలు పెట్టారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలుత రాజమండ్రిలో తర్వాత మైసూర్‌ రాజా వారి సభలో హరికథా గానం ఆలపించడంతో విజయనగరం ప్రతిభ రాష్ట్రేతరాలకు పాకింది. బహుభాషా కోవిదుడైన ఆదిభట్ల తెలుగు నాటనే కాక ఇతర రాష్ట్రాలలో హరికథలు చెప్పి అక్కడి స్థానికులను తన గానంతో ప్రభావితం చేశారు. 1864 ఆగస్టు 31న ఇప్పటి పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం అజ్జాడలో గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటాచైనులకు తొలి సంతానంగా నారాయణ దాసు జన్మించారు. కేవలం ఐదేళ్ల ప్రాయంలోనే సంస్కృతంలో పద్యాలను అలవోకగా పట్టేసేవారు. పద్యాలు, శ్లోకాలు విని కంఠస్థా పెట్టేవారు. మొత్తం తొమ్మిది భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన ఆదిభట్ల నారాయణ దాసు ఆష్టావధానం కూడా చేసేవారు. ఆయన ప్రతిభను చూసే విజయనగరం ఆనందగజపతి రాజు తన ఆస్థానంలో స్థానం కల్పించారు. 1922లో ప్రచురితమైన నవరసతరంగిణిలో పద్యాలు, శ్లోకాలు వాటి తాత్పర్యాలను రచయిత షేక్‌ స్పియర్‌ రాసిన రచనలతో తారతామ్యం చూసి తెలుగులో ఆయన అనువదించేవారు. ఆపై తిరిగి రాసేవారు. కాగా ఆదిభట్ల రచనలలో ఖ్యాతిగొన్నది జగజ్యోతి. తాత్విక రచనా భావజాలంతో పాటు అప్పటి భారతదేశంలో తాత్వికులు సిద్ధాంతాలు, దృక్పథాలను తాను రాసిన గ్రంథంలో పొందుపరిచారు ఆదిభట్ల. అప్పట్లో ఆది భట్ల ప్రతిభను గుర్తించే విజయనగరం అలక్‌ నారాయణ మహారాజు తాను స్థాపించిన సంగీత కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా ఆయనను నియమించారు. నారాయణ దాసు సంగీత, సాహిత్య ప్రతిభకు గుర్తుగా లయ బ్రహ్మ, పంచముఖి, పరమేశ్వరి అనే బిరుదులను పొందారు.

ఎంతలా ఆదిభట్ల హరికథ ప్రేక్షకులను ఆకట్టుకునేదంటే విజయనగరంలోని ఎంఆర్‌ కళాశాల వద్ద సత్య లాడ్జి వేదికగా తన గాన మాధుర్యంతో పద, గద్యాలతో ఆయన హరికథా గానం చేస్తుంటే..ఆకాశంలో మేఘాలు గర్జించి వరుణదేవుడు కరుణించి కుండపోతగా వర్షం పడుతున్నప్పటికీ ప్రేక్షకులెవరూ ఆదిభట్ల హరికథా గానం పూర్తయ్యేవరకు కదలకపోవడం విశేషం. 1864 ఆగస్టు 31న జన్మించిన 1945 జనవరి 2 పరమపదించారు.

ఆదిభట్ల నారాయణ దాసు 162 జయంతిని ఆయన ముని మనుమడు, వారసుడైన ఆదిభట్ల ఆనంద్‌ తాతగారి స్వగృహంలోనే సోమవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఫలాపేక్ష ఆశించకుండా హరికథకు తాతగారు ఎలా ప్రాణం పెట్టి పొసి ప్రాచుర్యం తెచ్చారో నేడు ఈ యాండ్రాయిడ్‌ యుగంలో కూడా ఆ హరికథా గానం అంతరించిపోకుండా ఆయన వారసులుగా తామంతా హరికథను వారసత్వంగా పుచ్చుకుని భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతోనే ఆదిభట్ల జయంతి, వర్థంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆదిభట్ల ఆనంద్‌ దాస్‌ అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన మహారాజా సంగీత,నృత్య కళాశాలలో తొలి అధ్యాపకుడిగా తాతగారి విగ్రహాన్ని ప్రతిష్టంచడం ముదావహమన్నారు. అయితే హరికథా పితామహుడిగా ఖ్యాతి నొందిన ఆదిభట్ల పాడిన హరికథను ప్రభుత్వ పాఠ్యాంశంగా పెట్టాలన్నదే తమ లక్ష్యమని ఆదిభట్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ఆనంద్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement