● సర్పంచ్ రిజర్వేషన్‌పై సందేహాలు
● గ్రామాల్లో విస్తృతంగా మొదలైన చర్చలు
● జిల్లాలో మొత్తం పంచాయతీలు 451
● రిజర్వేషన్లపై జోరుగా సాగుతున్న బెట్టింగ్స్
వీరఘట్టం: ఈ ఏడాది ఏప్రిల్ 2తో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది.దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం నుంచి కూడా ఇటీవల గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ఏడాది చివరి కల్లా స్థానిక ఎన్నికల నగారా మోగించేందుకు యంత్రాంగం సమాయత్తం అవుతోంది. అయితే సర్పంచ్ పదవి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహులు ప్రస్తుతం ప్రజలతో మమేకమవుతున్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కత్తులు దూసుకున్న వారంతా నేడు పొత్తుల కోసం పాకులాడుతూ ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు.ఇదంతా బాగున్నప్పటికీ సర్పంచ్ రిజర్వేషన్ ఏ సామాజిక వర్గానికి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పంచాయతీ ఈ సారి ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు? మహిళలకు మాత్రమేనా? లేక జనరల్ కేటగిరికి కేటాయిస్తారా అంటూ ఆశావహులు వాకబు చేస్తున్నారు.
రిజర్వేషన్లపై జోరుగా బెట్టింగులు
ఇంతవరకు మనం క్రికెట్ బెట్టింగ్‌లు గురించి విన్నాం, ఇప్పుడేమో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ రిజర్వేషన్లపై కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఉదాహరణకు.. వీరఘట్టం మేజర్ పంచాయతీలో గత నాలుగు ఎలక్షన్స్‌లో సర్పంచ్ అభ్యర్థి రిజర్వేషన్లు వరుసగా ఎస్సీ జనరల్, బీసీ మహిళళ, జనరల్ మహిళ, ఎస్టీ మహిళకు కేటాయించారు.
మళ్లీ రొటేషన్ ప్రకారం ఈసారి ఎస్సీ జనరల్‌కు కేటాయిస్తారని అంతా అనుకుంటున్నారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్లపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి.ఇంకొన్ని పంచాయతీల్లో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రిజర్వేషన్లపై బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 451 గ్రామ పంచాయతీల్లో 3,524 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.జిల్లాలో 12 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. అందరి చూపు ప్రస్తుతం మేజర్‌పంచాయతీ రిజర్వేషన్ల పైనే ఉంది.ఏది ఏమైనప్పటికీ రిజర్వేషన్లు ప్రకటించేవరకు ఎవరి ఊహాగాలను వారికే వదిలేద్దాం.


