పార్వతీపురం: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్‌ఎస్)లో ప్రజలు తమ వినతులను సమర్పించవచ్చునని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని, వాటి స్థితిని 1100 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌లో ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన ఇవ్వండి
పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను వెల్లడించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఓ జూనియర్ కళాశాలలో సెకెండ్ ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని గర్భం దాల్చింది. వేసవిసెలవుల అనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థిని రుతుక్రమం అవుతుందంటూ ప్రతి నెలా రిజిస్టర్‌లో అడగకుండానే సంతకాలు పెట్టేస్తుండడంతో అనుమానంతో కళాశాల సిబ్బంది పరీక్ష చేయించగా నాలుగు నెలల గర్భవతిగా నిర్ధారణ అయింది. ఈ సమాచారాన్ని కళాశాల ప్రిన్సిపాల్ తమ ఉన్నతాధికారులకు, బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. అంతేకాకుండా బాలికకు టీసీ ఇచ్చి ఆమె తల్లిదండ్రులతో ఇంటికి పంపేశారు. ఈ విషయమై ఎల్విన్ పేట ఎస్సై బి.శివ ప్రసాద్ వద్ద ప్రస్తావించగా..తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలియజేశారు.
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు ఈ ఏడాది జలకళ లేదు. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ఇన్‌ఫ్లోస్ రాకపోవడంతో ప్రాజెక్టు అడుగంటుతోంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులోకి 10వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. 64.60 మీటర్ల లెవెల్ నీటిమట్టం నమోదైంది. ఈ లెక్కన 3 టీఎంసీల నీరు నిలువ ఉండేది. అప్పట్లో మిగులు నీరు గేట్లు ద్వారా దిగువకు విడిచిపెట్టే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది ప్రాజెక్టు వద్ద 600 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి చేరుతోంది. 61.90 మీటర్లు నీటిమట్టం నమోదైంది. 1.10 టీఎంసీల నీరు నిలువ ఉంది. దీంతో ఆయకట్టు పరిధిలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం: నగరంలో ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక విజయనగరం శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 4 నుంచి 8వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధ్యక్షుడు వానపల్లి శంకరరావు తెలిపారు. ఈ మేరకు వేడుకలకు రావాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు ఆదివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపిన జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవాలని, త్రైత సిద్ధాంతంలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మలతో కూడిన జ్ఞానం ఇమిడి ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు.


