పార్వతీపురం రూరల్: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి.రవి (పీసీ–602) కుటుంబానికి పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు శాఖ కొండంత అండగా నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పోలీసు శాలరీ ప్యాకేజీ కింద మంజూరైన రూ.కోటి చెక్కును రవి సతీమణి లలితకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న రవి ఈ ఏడాది జనవరి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. ఆయన కుటుంబానికి భరోసా కల్పించేలా పోలీసు ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుని ఈ బీమాను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ.. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ వేతన ప్యాకేజీని అమలు చేస్తున్నామని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి, సాధారణ మరణానికి రూ.10 లక్షల పరిహారం అందుతుందని వివరించారు. బాధిత కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని, ఏ సమస్య వచ్చినా నేరుగా కలవవచ్చని ఆయన ధైర్యం చెప్పారు. వచ్చిన సొమ్మును వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, విజయనగరం కంటోన్మెంట్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.


