విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు తమ సత్తాను నిరూపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వేదికగా జరిగిన సబ్ జూనియర్స్, క్యాడెట్, జూనియర్స్, సీనియర్స్ పోటీ ల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన బాల, బాలికలు మొత్తంగా 29 పతకాలు సాధించి క్రీడల ఖిల్లా విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం జిల్లా నిర్వహణలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు.
ఈ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు మొత్తం 29 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 17 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 6 కాంస్య పతకాలు దక్కించుకున్నారు. పూమ్సే విభాగంలో విజయనగరం జిల్లా ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానం సాధించగా, క్యూరిగి విభాగంలో జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం, క్యాడెట్ కేటగిరీలో తృతీయ స్థానం సాధించడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్.వేణుగోపాల్ రావు, గురాన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురాన రాధిక, కోచ్‌లు యశస్విని, అమృత, యశ్మిత, హర్షిణి పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


