నెల్లిమర్ల రూరల్: ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ముల అనుబంధం.. కేవలం రూ.6 వేల బకాయి విషయంలో తలెత్తిన వివాదంతో విషాదంగా ముగిసింది. ట్రాక్టర్ డబ్బుల విషయంలో చిన్నగా మొదలైన గొడవ.. మాటామాటా పెరిగి కోపాన్ని రగిల్చింది. చివరికి ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. ఈ సంఘటనపై ఎస్సై గోపాలరావు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన సిరుగుడి రామారావు (60), సిరుగుడి అప్పలనారాయణ సొంత అన్నదమ్ములు. తమ్ముడు రామారావుకు చెందిన ట్రాక్టర్‌ను గతంలో పొలం పనులకు ఉపయోగించుకున్నందుకు గాను అప్పలనారాయణ ఆరు వేల రూపాయలు బకాయి పడ్డాడు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం అప్పలనారాయణ పొలం పనులకు వేరే ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసుకోవడంతో తమ్ముడు రామారావు ప్రశ్నించాడు. బకాయి చెల్లించకుండా వేరే ట్రాక్టర్ ఎందుకు పెట్టుకున్నావని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగింది. అదే సమయంలో అప్పలనారాయణ కుమారుడు సిరుగుడి శ్రీను కర్రతో చిన్నాన్న రామారావు తలపై బలంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న రామారావు కుమారుడు పవన్ సంఘటనా ప్రాంతానికి వెళ్లి తండ్రిని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అక్కడకు కొద్దిసేపటికే రామారావు మృతి చెందాడు. దీంతో వల్లూరులో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం తెలుసుకున్న సీఐ దుర్గాప్రసాద్ గ్రామానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ. ఆరు వేల కోసం
అన్నదమ్ముల మధ్య వివాదం
చిన్నాన్నపై అన్నయ్య కుమారుడి దాడి
కొద్ది సేపటిలోనే ఆయన మృతి


