● ఓవరాల్ చాంపియన్‌గా అంబికాపూర్ సైనిక పాఠశాల
● విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందించిన సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, కల్నల్ శాస్త్రి
విజయనగరం రూరల్: ఆల్ ఇండియా సైనిక పాఠశాలల జాతీయ క్రీడా పోటీలు – 2026లో భాగంగా కోరుకొండ సైనిక పాఠశాలలో ఈ నెల 19 నుంచి జరుగుతున్న ఇంట్రా గ్రూప్ కాంపిటేషన్ – గ్రూప్ – ఎఫ్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో కోరుకొండ సైనిక పాఠశాలతో పాటు భువనేశ్వర్, అంబికాపూర్, సంబల్‌పూర్ సైనిక పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గ్రూప్ – ఎఫ్ చాంపియన్‌గా అంబికాపూర్ సైనిక పాఠశాల విజేతగా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణతో, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. పతకం అనేది ఫలితాన్ని మాత్రమే సూచిస్తుందని, ప్రవర్తనే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని గుర్తు చేశారు. ఈ పోటీలు జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయడానికి ఒక వేదికగా నిలిచిందని, వివిధ సైనిక పాఠశాలల మధ్య సత్సంబంధాలను, ఐక్యతను మరింత పెంపొందించాయని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ కిరణ్ పాల్గొన్నారు.


