ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయ నిర్మాణం

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

విజయనగరం రూరల్‌:

జిల్లా కేంద్రం, మహారాణిపేట సర్వే నంబర్‌ (టీఎస్‌) 569లో అన్ని అనుమతులు, ప్రభుత్వ నిబంధనల మేరకే వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నిర్మిస్తున్నట్టు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పదోవ పట్టించేవిధంగా ఇటీవల కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికల్లో వైఎస్సార్‌ సీపీ కార్యాలయ నిర్మాణంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనే ఆలోచనతో, పార్టీ ఆదేశాల మేరకు 2021లో అధికారులకు దరఖాస్తు చేశామన్నారు. నాటి అధికారులు ఎకరా స్థలాన్ని గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2022 జనవరి 12న కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ 340 జీఓను జారీ చేసిందన్నారు. ఈ జీఓను అనుసరించి స్థలం కేటాయింపునకు నాటి తహసీల్దార్‌ విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతులు కోరుతూ లేఖ రాయగా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆమోదముద్ర ఇచ్చిందన్నారు. అదే ఏడాది మే 18న కలెక్టర్‌ స్థలం కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు తహసీల్దార్‌ 2022 జూన్‌ 6న ప్రభుత్వ నిబంధనల మేరకు పొజిషన్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేశారని స్పష్టంచేశారు. అన్ని నిబంధనలు అనుసరించి టీఎస్‌ నంబర్‌ 569లో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఎకరా స్థలం కేటాయించారన్నారు. అన్ని అనుమతులు లభించిన మీదట 2023 జనవరి 28న పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు. నాడు కార్యాలయ నిర్మాణానికి సంబంధించి సంబంధిత శాఖల అనుమతులు కోరుతూ దరఖాస్తు చేశామన్నారు. రెండేళ్ల నుంచి సాగుతున్న నిర్మాణ పనులు చివర దశకు చేరుకున్నాయని చెప్పారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక...

చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక అక్కసుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ కార్యాలయాలకు నోటీసులు అందించే కార్య క్రమం చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఉన్న కార్యాలయానికి అనుమతులు లేవన్న నెపంతో కూలగొట్టిందని, దీనిపై పార్టీ హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణానికి ప్రాథమిక అనుమతులు ఉన్నా, ఒకటి రెండు శాఖల అనుమతులు, వీఎంఆర్‌డీఏ అనుమతి లేదని నోటీసులు అందించారని తెలిపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, పూర్తి స్థాయి అనుమతులు ఉంటే భవన నిర్మాణానికి అను

మతులు ఇవ్వాలని కోర్టు చెప్పిందని తెలిపారు. అయితే 2026లో అగ్నిమాపక శాఖ అనుమతి లేదని మున్సిపల్‌ కమిషనర్‌ తెలపగా, నిబంధనల ప్రకారం ఎన్‌ఓసీ అవసరం లేదని తెలిపారన్నారు. వీఎంఆర్‌డీఏ నిబంధనల ప్రకారం ఓపెన్‌ స్థలం 14 శాతం ఉండాలన్నారని, అయితే ఆ నిబంధన కార్యాలయ నిర్మాణానికి వర్తించదని నోటీసులకు జవాబు ఇచ్చినట్టు స్పష్టంచేశారు. కొద్ది రోజుల కిందట అశోక్‌గజపతిరాజు కుటుంబం నుంచి స్థలం విషయంలో సమస్య లేవనెత్తి ఫిర్యాదు చేశారని, దీనిని తహసీల్దార్‌కు పంపించారన్నారు. ఆయన వివరణ రాగానే అప్పగిస్తామని నగరపాలక సంస్థ నుంచి నోటీసు పంపించారని వివరించారు. ఇప్పటికే కార్యాలయంలో కార్యకలాపాలు జరుగుతున్నాయని, గత నాలుగేళ్లుగా నిర్మాణం జరుగుతున్నా ఎప్పుడు లేవనెత్తని అభ్యంతరాలు ఇటీవల మీడియాలోనే చూడడం జరిగిందన్నారు. మీడియాలో వచ్చిన కథనాలు పూర్తి నిరాధారమైనవని, కనీస వివరణ తీసుకోకుండా అసత్య కథనాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయ పార్టీలకు పార్టీ కార్యాలయ నిర్మాణాలకు ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంటే నిబంధనలు అనుసరించి కేటాయించడం జరుగుతుందని, ఇటీవల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 66 ఏళ్ల లీజుతో రెండెకరాలు ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో, నిబంధనలకు లోబడి, ప్రభుత్వ జీఓ అనుసరించి, అధికారుల అన్ని అనుమతులతోనే పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెక్కల నాయుడుబాబు, పీరుబండి జైహింద్‌కుమార్‌, గొర్లె రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురితం చేయడం దురదృష్టకరం

నిబంధనలు, ప్రభుత్వ జీఓ ప్రకారమే ఎకరా స్థలం కేటాయింపు

మీడియా సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌

మజ్జి శ్రీనివాసరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement