బొబ్బిలిలో ఇసుక అక్రమ వ్యాపారం జోరందుకుంది. పారాది, అలజంగి, భోజరాజపురం తదితర గ్రామాల తీరంలో వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రీ పగలు తేడాలేకుండా సాగుతున్నాయి. ఇసుకాసురులు నదిని గుల్లచేస్తున్నారు. గోతులమయంగా మార్చుతున్నారు. ఇసుక తవ్వకాల విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. మరో విశేషమేమిటంటే దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు గ్రోత్‌సెంటర్‌లోని కంపెనీలకు అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ఒక్కోగ్రామ టీడీపీ నాయకుడు ఒక్కో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. నదిలో ఇసుకను తవ్వుతూ గ్రోత్‌సెంటర్‌లోని కంపెనీలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఉదయానికే గ్రోత్ సెంటర్‌కు ఇసుక ట్రాక్టర్లు క్యూ కడుతున్నా అటువైపు చూసేవారు లేకపోవడం గమనార్హం. రాజులపాలనలో ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని, నేతలందరికీ వాటాలు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమతవ్వకాల అంశాన్ని బొబ్బిలి తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ప్రస్తావించగా ఇసుకతో వ్యాపారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటీవల మూడు ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించామని చెప్పారు. – బొబ్బిలి


