● భూసార పరీక్షలపై నిర్లక్ష్యం!
● నిధులు విదల్చని టీడీపీ ప్రభుత్వం
● పరీక్షలకు నోచుకోని మట్టి నమూనాలు
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చంద్రబాబు సర్కారు గొప్పలు చెబుతుంది. వాస్తవ పరిస్థితి క్షేత్ర స్థాయిలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రతీ రైతు భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ భూసార పరీక్షలు చేసేందుకు అవసరమైన నిధులు మాత్రం విదల్చకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీంతో పరీక్షల కోసం సేకరించిన మట్టి నమూనాలు మూటల్లోనే వ్యవసాయ పరిశోధన కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేలాది మట్టి నమూనాలు ఏడాది కాలంగా మూటల్లో ఉన్నాయి. భూసార పరీక్షల కోసం నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు.
నిధుల్లేకే..
2025 –26 సంవత్సరానికి సంబంధించి ప్రకృతి వ్యవసాయం(ఎన్‌ఎంఎన్‌ఎఫ్) కింద 33,104 మట్టి నమూనాలు సేకరించాలన్నది లక్ష్యం. ఇందుకుగాను వ్యవసాయ సిబ్బంది 32,046 మట్టి నమూనాలు సేకరించి విజయనగరంలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించారు. ఒక్కో మట్టి నమూనా పరీక్షించి కార్డు ఇచ్చేందుకు రూ.180లు ఖర్చవుతుంది. ఈ లెక్కన 33,104 మట్టి నమూనాల పరీక్షలకు రూ.59.58 లక్షలు అవసరం. 2026 ఖరీఫ్ సీజన్ వచ్చేసినా ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదల్చలేదు. దీంతో మట్టి నమూనాలు మూటల్లోనే మూలిగే పరిస్థితి దాపురించింది. వాస్తవంగా మట్టి నమూనాలను ఏ సీజన్‌లో సేకరిస్తారో ఆ సీజన్ ఆరంభం నాటికి రైతులకు అందజేస్తే ప్రయోజనం ఉంటుంది. భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు.
ప్రోత్సాహం ఇలాగేనా..
రసాయనిక ఎరువుల వాడకానికి స్వస్తి పలికి ప్రతీ రైతు ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిలో సాగు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. ఇందుకోసమే వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు చేయిస్తున్నారు. వాటి ఫలితాలు ఆధారంగా పంటలు ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిలో సాగు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం భూసార పరీక్షలకు నిధులు ఇవ్వకపోవడంతో మట్టి పరీక్షల ఫలితాలు లేకుండానే సాగు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ప్రతీ నమూనాకు 13 రకాల పరీక్షలు
సేకరించిన ప్రతి మట్టి నమూనాకు 13 రకాల పరీక్షలు చేస్తారు. నేల స్వభావం, ఉదజని సూచిక(పీహెచ్), లవణ సూచిక(ఈసీ), సేంద్రియ కర్బనం (ఓసీ) లభ్య నత్రజని(ఎన్), లభ్య భాస్వరం, లభ్య పోటాష్, లభ్య గంధకం తదితర పరీక్షలు చేస్తారు. ఈ ఫలితాల సూచికగానే ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తారు. కానీ ఈ పరీక్షలు జరపనపుడు ఏం ప్రయోజనం. చంద్రబాబు సర్కారు చెప్పిందొకటి.. చేసేదొకటి.. అన్న చందంగా వ్యవసాయంలో తన తీరును కనబరుస్తుంది. దీంతో సాగులో రైతులకు అవస్థలు తప్పడం లేదు.
నిధులు ఇంకా రాలేదు..
2025 – 26 సంవత్సరానికి సంబంధించి 33,104 భూసార పరీక్షలు చేయాలన్నది లక్ష్యం. భూసార పరీక్షల చేయడానికి అవసరమైన రూ.59.58 లక్షల నిధులు ఇంతవరకు రాలేదు.
– ఎ.నిర్మలజ్యోతి , సహాయ సంచాలకులు, భూసార పరీక్ష కేంద్రం


