వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములనాయుడు ప్రాజెక్ట్ ప్రధాన గేట్లు దిగువ భాగంలో విద్యుత్ శాఖ ఉద్యోగి కోమటిపల్లి సూర్యనారాయణ(60) ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు హెడ్ కానిస్టేబుల్ నీలం శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రేగిడి మండల విద్యుత్ శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా సూర్యనారాయణ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న విధులు ముగించుకుని ఆయన ఇంటికి రాలేదు. ప్రధాన గేట్లు దిగువ భాగంలో మృతదేహం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నీటిలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన అనంతరం వివరాలు సేకరించారు. రాజాంలోని అమ్మవారి కాలనీలో నివాసముంటున్న సూర్యనారాయణగా గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మడ్డువలస వైపు రాగా ప్రాజెక్ట్ దిగువ భాగం లోతుగా ఉండడంతో కాలు జారి నీటిలో పడిపోయి ఉంటాడని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటాడని ఆయన భార్య స్వర్ణలత ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ తెలిపారు.
చెరువులో దూకి వ్యక్తి..
విజయనగరం క్రైమ్ : నగరంలోని పెద్ద చెరువులో లంకేన సత్యనారాయణ(36) దూకి మృతి చెందినట్టు వన్ టౌన్ ఎస్‌ఐ రవి శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలసకు చెందిన లంకేన లక్ష్మి తన భర్త సత్యనారాయణను విశాఖలోని మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి చికిత్స కోసం తీసుకువెళ్తుంది. ప్రయాణంలో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బస్సు రాగానే మతి స్థిమితం లేని సత్యనారాయణ బస్సు దిగి కనిపించకుండా పోయాడు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో ఓ వ్యక్తి పెద్ద చెరువులో పడి ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకొని లక్ష్మి అక్కడకు వెళ్లగా అక్కడ తన భర్త చెప్పులు, తువ్వాలును గుర్తించినట్టు ఎస్‌ఐ తెలిపారు. భర్తకు ఉన్న మానసిక అనారోగ్యం వల్ల పెద్ద చెరువులో దూకి చనిపోయి ఉంటాడని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


