● అండర్–19 చెస్ పోటీలకు స్పందన
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న అండర్ – 19 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం ముగిసాయి. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం, ఫైర్ చెస్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక పోటీలో ఓపెన్ విభాగంలో ఎం.కృష్ణసాయి సూరజ్, ఎం.అరవన్, రొంగలి ప్రేమ్‌కుమార్, కె.హిమాంస్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో ఉన్నారు. బాలికల విభాగంలో ఆర్‌వి.మాధురి మోక్షిత, కొండేటి నితీషా, ఇజ్జరోతు భావన, బైరెడ్డి షణ్ముక ప్రియ జిల్లా జట్టులో స్థానం దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఎంపికైన క్రీడాకారులు జూలై నెలలో అనకాపల్లిలో జరగనున్న అండర్–19 చెస్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్టు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా ప్రతినిధి కెవి.జ్వాలాముఖి తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతులుగా ఎ.హేమబిందు, ఉషారాణి వ్యవహరించారు.
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో టెట్ పరీక్షను పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) డిమాండ్ చేసింది. స్థానిక అమర్ భవనంలో శుక్రవారం నిర్వహించిన సంఘం జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నూత న పీఆర్‌సీ కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల టెట్ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు సుదీర్ఘకాలంగా రావాల్సి ఉన్న పెండింగ్ బకాయిలన్నింటినీ సకాలంలో పూర్తి స్థాయిలో విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు కేవీ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


