జీసీసీ సేల్స్‌మెన్‌లకు పనిభారం | - | Sakshi
Sakshi News home page

జీసీసీ సేల్స్‌మెన్‌లకు పనిభారం

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

జీసీసీ సేల్స్‌మెన్‌లకు పనిభారం

ఎం.డి దృష్టికి తీసుకెళ్లాం

సీతంపేట:

గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యావసర వస్తు విక్రయశాలల్లో పనిచేసే సేల్స్‌మెన్‌లు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. మొత్తం 23 రేషన్‌డిపోలు ఉండగా కేవలం పదిమంది సేల్స్‌మెన్‌లు మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 14 మందికి గాను ఇటీవల నలుగురుకు పదోన్నతులు రావడంతో వెళ్లిపోయారు. ఇప్పటికే ఇన్‌చార్జిలతో రేషన్‌ దుకాణాలు నడుస్తున్నప్పటకీ కొత్తవారిని నియమించడంలేదు. నిబంధనల ప్రకారం ప్రతీనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రేషన్‌ దుకాణాలు తెరచి ఉంచాలి. తెలుపు రేషన్‌కార్డు దారులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందజేయాలి. సిగ్నల్‌ లేకపోవడంతో లబ్ధిదారుల వేలిముద్రలు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజంతా 20 మందికి మించి సరుకులు ఇవ్వలేని పరిస్థితి. ఒక్కో డిపో పరిధిలో వెయ్యి వరకు రేషన్‌ కార్డులు ఉంటాయి. సాంకేతిక అవరోధాల నడుమ రెండుమూడు డిపోల బాధ్యతలు ఎలా చూడగలమంటూ సేల్స్‌మెన్‌లు ఆవేదన చెందుతున్నారు. సీతంపేట ఏజెన్సీలో 16 వేలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయని, వీరందరికీ సకాలంలో రేషన్‌ సరఫరా చేయాలంటే తమవల్ల కాదంటే చేతులెత్తేస్తున్నారు.

సేల్స్‌మెన్‌లకు కొత్తగా కేటాయించిన డిపోలు ఇలా...

ఎన్‌.చిన్నబాబు (మానాపురం, గంగంపేట, దోనుబాయి), ఎస్‌.రామారావు (పూతికవలస, కె.గుమ్మడ, కుశిమి), ఎన్‌.రంగారావు (పెదరామ, సామరెల్లి, చిన్నకంబ), కె.విశ్వనాథం (భామిని, మనుమకొండ), బి.శోభన్‌బాబు (సొలికిరి, కడగండి), హెచ్‌.బాలకృష్ణ (వలగెడ్డ, శంబాం), ఎన్‌.నాగరాజు (అడ్డాకులగూడ, కోడిశ), ఎస్‌.సురేష్‌ (సోమగండి, కిల్లాడ), ఎ.సునీత (గొట్టిపల్లి, లబ్బ), ఎన్‌.సుందరరావు (హడ్డుబంగి, సీతంపేట) లు కేటాయించారు. సీతంపేట, భామిని మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల పరిధిలో కూడా జీసీసీ నిత్యావసర దుకాణాలు ఉన్నాయి.

సేల్స్‌మెన్‌లు తక్కువగా ఉన్నారని, సరుకుల సరఫరాలో జాప్యం జరుగుతోందని ఎం.డి దృష్టికి తెలియజేశాం. త్వరలోనే రేషన్‌డీలర్‌ పోస్టులు భర్తీచేస్తామని, సమస్య పరిష్కారమవుతుందని ఉన్నతాధికారులు తెలియజేశారు. ఇప్పటికీ ఖాళీల వివరాలను నివేదించాం.

– దాసరి కృష్ణ, జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement