పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మాదకద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో ‘నిషాముక్త్ భారత్ సప్తాహ్’ కార్యక్రమా న్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి జెండా ఊపి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లా ను మత్తురహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గతంలో 50 శాతంగా ఉన్న జిల్లా అక్షరాస్యత ప్రస్తుతం 86 శాతానికి చేరిందని, విద్యాపరంగా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోందని వివరించారు. ఈ క్రమంలో యువత గంజాయి తదితర మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యా ల అక్రమరవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించి అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించా రు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని.. డ్రగ్స్‌కు బానిస కాబోమంటూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు.


