పార్వతీపురం: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, నేలలో తేమ తగ్గే అవకాశం ఉందని, రైతు లు ముందస్తు ప్రణాళికలతో పంటలు సాగుచేయా లని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. కలె క్టరేట్‌లో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబురావునాయుడుతో కలిసి ఎల్‌నినో అవగాహన కరపత్రాలను గురువారం విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని, పశుగ్రాసం కొరత ఏర్పడవచ్చన్నారు. ప్రకృతి వ్యవ సాయ పద్ధతులు, దేశీ విత్తనాలతో బహుళ పంటల సాగు, తక్కువ నీటితో పంటల సాగు, పశుగ్రాస ఉత్పత్తి వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు అవగాహన కరపత్రాల్లోని సూచనలు పాటించి నష్టాలను నివారించుకోవాలన్నారు.
‘మార్ట్’తో మార్పు..
గిరిజన రైతాంగాన్ని సుసంపన్నం చేయడమే లక్ష్యంగా 2026–31 కాలానికి మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్(మార్ట్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో మార్ట్ ప్లాగ్‌షిప్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ థాయ్‌లాండ్ తరహా ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మిరియాలు వంటి అంతర పంటల సాగు, వర్షపు నీటి సంరక్షణ, గట్టు మీద చెట్టు వంటి వినూత్న కార్యక్రమాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అధికారులకు సూచించారు. కౌలు కార్డుల పునరుద్ధరణ, కౌలుదారులకు పంట రుణాల మంజూరు కోసం పది రోజు ల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయి పనితీరును ప్రతిరోజూ పర్యవేక్షిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,800 చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించి మత్స్య ఉత్పత్తిని పెంచాలని సూచించారు.


