బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగల హల్‌చల్‌

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగల హల్‌చల్‌

బొబ్బిలి: బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గురువారం దొంగలు హల్‌చల్‌ చేశారు. బస్సెక్కుతున్న మహిళ మెడలోని మూడు తులాల పుస్తెలతాడుతో పాటు మరో ప్రయాణికుడి జేబులోని రూ.7వేలను కాజేశారు. బొబ్బిలి స్వామివారి వీధికి చెందిన బోరసింగి అచ్చియ్యమ్మ తల్లి, చెల్లితో కలిసి విజయనగరంలో జరుగుతున్న బంధువుల శుభకార్యానికి బయలుదేరింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చి పార్వతీపురం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సెక్కుతున్నారు. అప్పటికే అక్కడ నక్కిఉన్న దొంగ అచ్చియ్యమ్మ మెడలోని పుస్తెల తాడును తెంపుకు పోయాడు. ఆమె గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అదే బస్సులో ప్రయాణించేందుకు బస్సెక్కుతున్న బలిజిపేటకు చెందిన గోపాలం అనే ప్రయాణికుడి జేబులోంచి రూ.7వేలను కొట్టేశారు. ఆ సమయంలో బస్సును నిలుపుదల చేసి తనిఖీలు చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ కె.నారాయణరావు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ప్లాట్‌ఫాం పక్కనే బస్సును నిలపకుండా కొంచెం దూరంగా పెట్టడం, ఆ సమయంలోనే మరోబస్సు అటుగా వచ్చినిలపడంతో సీసీ ఫుటేజీల్లో స్పష్టత కానరావడం లేదన్నారు. పాత నేరస్తులను పట్టుకుని విచారిస్తామన్నారు.

బస్సెక్కుతుండగా మహిళ పుస్తెలతాడు చోరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement