మంచం పట్టిన మన్యం | - | Sakshi
Sakshi News home page

మంచం పట్టిన మన్యం

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

హెల్త్‌ అసిస్టెంట్లకు

డిప్యుటేషన్‌

మలేరియా కేసులను అదుపుచేయడానికి హెల్త్‌ అసిస్టెంట్‌లను డిప్యూటేషన్‌పై నియమిస్తున్నట్టు డీఎంహెచ్‌ఓ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. ఆయన మండలంలోని కుశిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. మలేరియా లేని ప్రాంతాల్లోని హెల్త్‌ అసిస్టెంట్‌లను హైరిస్క్‌ మలేరియా ఉన్న పీహెచ్‌సీలకు పంపిస్తున్నట్టు తెలిపారు. హెల్త్‌అసిస్టెంట్లు ఇకపై కచ్చితంగా వీక్లీ సర్వలైన్స్‌ చేయాలన్నారు. ఇప్పటివరకు నెలకు రెండు సార్లు గ్రామాలను సందర్శించిన సిబ్బంది, ఇకపై నాలుగు సార్లు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. సీతంపేట మండలంలోని నౌగూడ గ్రామానికి చెందిన పూర్ణచంద్ర, జొనగకు చెందిన సవర దివాకర్‌ మరణాలపై విచారణ సాగుతోందన్నారు. స్క్రీనింగ్‌ టెస్టులో మలేరియా నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయపార్వతి, డీఎంఓ సత్యనారాయణ, కన్సల్టెంట్‌ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట:

న్యం ప్రజలను జ్వరాలు వణికిస్తున్నాయి. కొద్దిరోజులుగా పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు రోగుల తాకిడి అమాంతం పెరిగింది. వైద్యపరీక్షల్లో మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఎపిడమిక్‌ సీజన్‌లో జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంటుంది. వర్షాలకు తాగునీటి వనరులు కలుషితం కావడం, ఆ నీటిని గిరిజనులు తాగడమే అనారోగ్యానికి ప్రధాన కారణం. అయితే, ఇటీవల మలేరియా కేసులు అధికంగా నమోదవుతుండడం, మరణాలు సంభవించడం ప్రజలను కలవరపెడుతోంది.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి జూన్‌ 21 వరకు 1,37,334 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 1224 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1,98,782 మందికి రక్తపరీక్షలు చేయగా 302 మందికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 10 పీహెచ్‌సీల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 63,914 మంది జ్వరపీడితులకు రక్త పరీక్షలు చేయగా 40 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మలేరియా బారిన పడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు ఈ సంఖ్యకు రెట్టింపు ఉంటారని అంచనా. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని పీహెచ్‌సీల్లో రోజుకు 50 నుంచి వంద వరకు ఓపీ నమోదవుతుండగా, ఏరియా ఆస్పత్రుల్లో 300 నుంచి 400 వరకు రోజువారీ ఓపీ నమోదవుతోంది. వీరిలో వైరల్‌, టైఫాయిడ్‌, మలే రియా జ్వరపీడితులే అధికంగా ఉంటున్నారు. ఇక ఆశ్రమపాఠశాలలు, గురుకుల పాఠశాలలు ప్రారంభం కావడంతో ఈ విద్యాసంస్థల్లో కూడా విద్యార్థులకు ఎక్కువగా జ్వరాలు సోకుతున్నాయి. జ్వరం వచ్చిందంటే అది 90 శాతం మలేరియా పాజిటివ్‌గా రక్తపరీక్షల్లో నిర్ణారణ అవుతుండడం

ఆందోళన కలిగిస్తోంది.

దోమతెరల పంపిణీ ఎక్కడ?

ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో దోమ తెరలు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. జిల్లాలో 3 లక్షలకు పైగా దోమతెరలు అవసరం కాగా కేవలం 25వేలు మాత్రమే రావడంతో వాటిని మలేరియా పాజిటివ్‌ కేసులు అధికంగా వచ్చిన గ్రామాల్లోని రోగులకు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన గ్రామాల ప్రజలకు దోమకాట్లు తప్పడంలేదు. గత రెండేళ్లుగా దోమతెరల కోసం ఎదురు చూపులే తప్ప ఫలితం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

ఆర్‌డీటీ కిట్‌ టెస్టులు నిర్వహిస్తున్నాం

అందరికీ ఆర్‌డీటీ కిట్‌ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఈ నెల 19 నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడైనా పారాసైట్‌ బయటపడితే వెంటనే ట్రీట్‌మెంట్‌ ప్రారంభిస్తాం. పీహెచ్‌సీల వారీగా టెస్టులు జరుగుతున్నాయి. మొదటి దశ దోమల నివారణ మందు పిచికారీ పూర్తయింది. రెండో విడత జూలై 15 నుంచి ప్రారంభమౌతుంది. దోమ తెరలు పూర్తిస్థాయిలో రావాల్సి ఉంది. – ఎం.వి.సత్యనారాయణ, డీఎంఓ, ఐటీడీఏ, సీతంపేట

పెరుగుతున్న మలేరియా పాజిటివ్‌ కేసులు

పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు రోగుల తాకిడి

ఆందోళనలో గిరిజన గ్రామాల ప్రజలు

అరకొరగా దోమతెరల పంపిణీ

ప్రచారానికే పరిమితమవుతున్న

అవగాహన సదస్సులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement