● మరో నెలరోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి..
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవతో పూర్తికావచ్చిన వంతెన నిర్మాణం
బొబ్బిలి రూరల్: బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన నూతన వంతెన నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. మరో నెలరోజుల్లో వంతెన నిర్మాణం పూర్తి కానుంది. వాహనచోదకులకు అందుబాటులోకి రానుంది. గత ప్రభు త్వం వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతులతో పాటు రూ.10 కోట్లను మంజూరు చేసింది. అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చొరవతో పారాది వద్ద వేగావతి నదిపై పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 2023లోనే బ్రిడ్జి నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో జీఎస్‌టీ నిధులు మరో రూ.3.5 కోట్లను కలిపి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. 7 పిల్లర్లు, 8 స్లాబ్‌ల నిర్మాణంతో దాదాపు బిడ్జి, అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తికావచ్చాయి. దశాబ్దాలుగా వంతెనపై ఎదుర్కొంటున్న రాకపోకల కష్టాలు తొలగనున్నాయి.


