సర్కారు సదరంగం | - | Sakshi
Sakshi News home page

సర్కారు సదరంగం

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

సర్కారు సదరంగం

విజయనగరం ఫోర్ట్‌: ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడిమల్లన్న చందాన ఉంది సర్కారు తీరు. పనిచేయించు కోవడం, ఆ తర్వాత విస్మరించడం టీడీపీ సర్కార్‌కు పరిపాటిగా మారిపోయింది. సదరం సర్టిఫికెట్స్‌ రీవెరిఫికేషన్‌ చేసిన వైద్యుల పరిస్థితే ఇందుకు నిదర్శనం. రీవెరిఫికేషన్‌ పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా వైద్యులకు టీఏ, డీఏల రూపంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు డబ్బులు కోసం గళమెత్తితే ప్రభుత్వ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని లోలోన మధనపడుతున్నారు. తమకు అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో చేసినప్పటికీ వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా జాప్యం ఎందుకని వైద్యులు వాపోతున్నారు.

దివ్యాంగుల పింఛన్‌ వెరిఫికేషన్‌

చంద్రబాబు సర్కార్‌ అధికారం చేపట్టిన తర్వాత దివ్యాంగులకు పింఛన్‌ వెరిఫికేషన్‌ పేరిట సదరం క్యాంపులు నిర్వహించింది. అయితే ఈ క్యాంపులకు సర్టిఫికెట్‌ ఇచ్చిన వైద్యులను కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర ఆస్పత్రులనుంచి వైద్యులను నియమించి సదరం సర్టిఫికెట్‌లు రీవెరిఫికేషన్‌ చేయించింది. ఇందుకోసం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాజాం, పార్వతీపురం గజపతినగరం, చీపురుపల్లి ఆస్పత్రులకు చెందిన వైద్యులు సదరం క్యాంపులకు తమ సొంత డబ్బులు పెట్టుకుని హాజరయ్యారు. సదరం క్యాంపులకు రీవెరిఫికేషన్‌ నిమిత్తం వచ్చిన దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్‌ చేశారు.

2025 జనవరిలో పరీక్షలు ప్రారంభం

2025 జనవరి నెలలో సదరం రీఅసెస్‌మెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పూర్తి కూడా అయిపోయింది. వారంలో మూడు రోజుల పాటు దివ్యాంగులకు రీ అసెస్‌మెంట్‌ చేసేవారు. బుధ, గురు, శుక్రవారరాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్‌మెంట్‌ నిర్వహించారు. 30 మంది వైద్యులు రీ అసెస్‌ మెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

30, 867 మందికి దివ్యాంగులకు పరీక్షలు

జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీఅసెస్‌మెంట్‌ చేశారు. దివ్యాంగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్‌ మెంట్‌ సర్టిఫికెట్స్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఎముకలు, ఈఎన్‌టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి 35,867మంది దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్‌మెంట్‌ నిర్వహించారు. రీఅసెస్‌మెంట్‌ చేసినందుకు గాను వైద్యులకు సుమారు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది.

వైద్యులకు దివ్యాంగుల రీవెరిఫికేషన్‌ డబ్బులు ఇవ్వరా?

నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా జాప్యం

రీవెరిఫికేషన్‌లో పాల్గొన్న వైద్యులు

30 మంది

వారికి రావాల్సిన బకాయి సుమారు రూ.15 లక్షలు

35,867మంది దివ్యాంగులకు పరీక్షల నిర్వహణ

బిల్లులు పంపించాం

దివ్యాంగులకు రీ అసెస్‌మెంట్‌ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు సంబంధించిన టీఏ, డీఏ బిల్లులు ప్రభుత్వానికి పంపించాం. ఫైనాన్స్‌లో బిల్లు ప్రాసెస్‌లో ఉందని తెలిపారు. వైద్యుల ఖాతాలకే నేరుగా డబ్బులు జమ అవుతాయి.

శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్‌డీఏ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement