రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారని పీడీ బి.అరుణ్‌కుమార్ బుధవారం తెలిపారు. ఇటీవల జగ్గయ్యపేటలో నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్ తరఫున కళాశాలకు చెందిన ఎస్.అశ్రిత (69 కేజీల విభాగం), ఎం.సాయిహర్షిణి (52 కేజీల విభాగం), ఎస్.జీవన్ (83 కేజీల విభాగంలో)లు ఎంపికయ్యారన్నారు. ఈ పోటీలు ఈ నెల 25 నుంచి 30 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయన్నారు. విద్యార్థుల ఎంపికపట్ల జీఎంఆర్ ఐటీ డీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్, ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ శశికుమార్, విద్యార్థులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలో మరో గిరిజన యువకుడిని మృత్యువు కాటేసింది. పంచాయతీ పరిధి గూనపాడు గ్రామానికి చెందిన దూసరి సోమయ్య(40) సకాలంలో వైద్యం అందక బుధవారం మృత్యువు పాలయ్యాడు. కొన్నిరోజులుగా మలేరియాతో గ్రామంలో గిరిజనం అవస్థల పాలవుతున్నారు. జ్వరంతో అవస్థ పడుతున్న సోమయ్యను ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్తులు అవస్థలు పడ్డారు. గ్రామం నుంచి డోలీ కట్టి, కిందికి మోసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే సోమయ్య మృతి చెందాడని, ఆస్పత్రికి రావడం ఆలస్యమైందని వైద్యులు తేల్చిచెప్పారు. సోమయ్య మృతితో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కులేక రోడ్డున పడ్డారు. దారపర్తి పంచాయతీ పరిధిలో గిరిశిఖర గ్రామాలకు గత ప్రభుత్వం హయాంలో రోడ్డు మంజూరు చేసి, నిధులు కేటాయించారు. కాగా కూటమి సర్కారు రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేయక గిరిజనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
గుమ్మలక్ష్మీపురం: ప్రేమ వివాహానికి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపం చెందిన ఓ గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దుడ్డుఖల్లు పంచాయతీ కొత్తవలస గ్రామానికి చెందిన కొండగొర్రి శివ(24) ఓ యువతిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరిచండంతో మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివ గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటకు వెళ్లి ఉరివేసుకున్నాడు. కొంతసేపటికి శివ ఆచూకీ కోసం గాలించిన కుటుంబసభ్యులు జీడితోటలో ఉరివేసుకుని ఉన్న శివను గుర్తించి హుటాహుటిన కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుధవారం జిల్లా ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎల్విన్‌పేట పోలీసులు తెలిపారు.


