దేదీప్యమానం..పైడితల్లి గ్రామోత్సవం | - | Sakshi
Sakshi News home page

దేదీప్యమానం..పైడితల్లి గ్రామోత్సవం

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

దేదీప్యమానం..పైడితల్లి గ్రామోత్సవం

యాగశాలలో విశిష్ట యాగ ప్రక్రియ

ఆకట్టుకున్న విచిత్ర వేషధారణలు

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం పునః ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న నూతన శిఖర ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవాల్లో బుధవారం వేకువజామునుంచే అమ్మవారి యాగశాలలో విశిష్ట పూజలు నిర్వహించారు. సింహాచల క్షేత్రం నుంచి వచ్చిన వేదపండితులు అమ్మవారికి విఘ్నేశ్వరపూజ, పంచగవ్య పూజాదికాలు, సోమ కుంభత్యాది ఆవాహనలు, ప్రాతరౌపాసనలు, దిగ్దేవతా బలిహరణలు, పునః పూజలు, వాస్తుహోమం, వాస్తు బలిహరణ, పర్యగ్నికరణము, జలాదివాసం, తదితర పూజాకార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌, ఆలయ ఈఓ కె.శిరీష స్వీయ పర్యవేక్షణ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ధాన్యాదివాసం, బింబశుద్ధి మంటపార్చన, పంచ శయ్యాదివాసం, మూర్తన్యాసం, వివిధ రకాల హోమాలు, అనంతరం స్వస్తివాచకములు నిర్వహించారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న పైడితల్లి గ్రామ ప్రదక్షిణ

పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పువాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, పులివేషాలు, బిందె డ్యాన్సులు, వేదపండితుల మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావనరణం నెలకొంది.

నేడు ఆలయ శిఖర ప్రతిష్ట

పైడితల్లి అమ్మవారి ఆలయ నూతన శిఖర ప్రతిష్ట మహోత్సవం గురువారం ఉదయం సుమూర్తం ప్రకారం ఉదయం 10.47 గంటలకు సింహల్నగమందు యంత్ర, శిఖర ప్రతిష్టాపన ఉంటుంది. పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ట, జీవ కళాన్యాసములు, కుంభ దర్శనము, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శిరీష తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement