లక్ష్యం మూరడు..
బలిజిపేట: బలిజిపేట మండలం పెదపెంకిలో బుధవారం నిర్వహించాల్సిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన వాయిదా పడింది. దీనికి లక్ష్యం మేరకు పనులు పూర్తికాకపోవడమే కారణంగా తెలుస్తోంది. పెదపెంకిలో సుమారు రూ.5.80కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో కమీషన్ల కోసం రాజకీయ ప్రమేయం అధికం కావడంతో జాప్యం జరుగుతోందన్న విమ ర్శలు ఉన్నాయి. పనుల లక్ష్యం బారెడు కాగా జరిగినవి జానెడుగా కనిపించడంతో డిప్యూటీ సీఎం పర్యటిస్తే ఏమవుతుందోనని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అయితే పనులు అతి తక్కువగా జరిగాయనే విషయం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో పర్యటన వాయిదా వేసుకున్నారని సమాచారం.
మమ అనిపించేద్దామనుకున్నా...
గ్రామంలో చేసిన కాసింత పనులు చూపించి పంపించే ప్రయత్నంలో రూట్‌మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. కంపు కొడుతున్న కాలువలపై బ్లీచింగ్‌ల జల్లి మసిబూసి మారెడుకాయ చేసేందుకు సిద్ధమయ్యా రు. దుర్గంధభరితంగా ఉండే కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య తొలగించారు. గ్రామం ప్రారంభంలో మంచి ముస్తాబు పనులు చేపట్టారు. అంతా ఆర్భాటం చేసి ఏదోవిధంగా డిప్యూటీ సీఎం పర్యటన మమ అనిపించేద్దామనుకున్న అధికారులకు నోట్లో వెలక్కాయ పడినట్టు పర్యటన వాయిదా పడిందనే విషయం తెలిసి మింగుడుపడడం లేదు.
పనుల్లో నాణ్యతా లోపాలు?
బయటకు కాస్త ఊపిరి పీల్చుకున్నా ఎప్పుడు ఉరుము ఉరుముతుందా అని భీతిల్లుతున్నారు. లక్ష్యం ప్రకారం వెచ్చించిన నిధులతో చేయాల్సిన పనులు ఇబ్బడిముబ్బడిగా చేయడంలో నాణ్యతా లోపాలను గుర్తించిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైలేరియా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామానికి ఉపాధిహామీ పథకంలో రూ.80లక్షల నిధులతో వీధికాలువల నిర్మాణాలు చేపట్టేందుకు, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రోడ్లు, కాలువల నిర్మాణాలకు రూ.5కోట్లు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ.5.80 కోట్లతో పీఆర్ ఆధ్వర్యంలో 49సీసీ రోడ్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 18 వీధికాలువల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.
పనుల వివరాలు ఇలా
రూ.5.80కోట్లతో గ్రామం లోపల భాగంలో వివిధ వీధుల్లో 4కిలోమీటర్ల పొడవున 49సీసీ రోడ్ల నిర్మాణం, 2,400మీటర్ల పొడవున 18చోట్ల వీధికాలువల నిర్మాణం జరిపేందుకు ప్రణాళిక తయారుచేశారు. వాటిలో వివిధ వీధుల్లో 1.7కిలోమీటర్ల మేర 14సీసీ రోడ్ల నిర్మాణాలు మాత్రమే జరిగాయి. మిగిలిన రోడ్ల నిర్మాణాలు జరగాల్సి ఉంది. వీధికాలువలకు సంబంధించి 1800మీటర్లమేర 14పనులు పూర్తిచేశారు. వాటిలో 190మీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ ఉన్నాయి. గ్రామంలో ఉండే వీధికాలువల పొడవు 12.8 కిలోమీటర్లు. వాటిలో ఉండే పాతకాలువలు, పాడైన వాటి సంగతి ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో రోడ్లు, కాలువల నిర్మాణాలకు ఆక్రమణలు అడ్డు ఉన్నాయని భావించిన అధికారులు 33 వీధుల్లో ఆక్రమణలను తొలగించారు. తొలగించిన వాటిలో 10వీధుల్లో మాత్రమే పనులు నిర్వహించారని మిగిలిన వాటి సంగతి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తికాకపోవడంతోనే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన రద్దయిందని, అధికారులు గ్రామంలో పనులు ఎప్పుడు పూర్తిచేస్తారో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


