● గిరిజన ప్రాంత ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని నిరసన
పార్వతీపురం రూరల్: షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను నూరు శాతం స్థానిక గిరిజనులకే కేటాయించాలని గిరిజనులు గర్జించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ను మంగళవారం ముట్టడించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమానికి యుటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ, ఐద్వా తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలను స్థానికులతో భర్తీ చేసే జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, దానికి చట్టబద్ధత కల్పిస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన గ్రామాలను
షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి
గిరిజన జనాభా అధికంగా ఉన్న నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను వెంటనే షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. సవర భాషా వలంటీర్లను రెన్యువల్ చేసి, కనీస వేతనాలు చెల్లించాలని, అలాగే నూతనంగా జాతాపు భాషా వలంటీర్లను నియమించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కె.హేమలత నిరసనకారుల వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే సోమవారం కలెక్టర్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గిరిజన, ప్రజా సంఘాల నాయకులు కె.రామస్వామి, లక్ష్మణరావు, మండంగి రమణ, ఎం.శ్రీనివాసరావు, బిడ్డిక ప్రకాష్, అడ్డమేశ్వరరావు, కె.సీతారాం, యూటీఎఫ్ నాయకులు ఎస్.మురళీమోహన్, కె.విజయ గౌరి, టి.రమేష్, కె.భాస్కరరావు, ఎస్ ఎఫ్‌ఐ నాయకులు సింహాచలం, అనిల్, గంగారామ్, సీఐటీయూ నాయకులు వై.మన్మథరావు, ఎన్.వై.నాయుడు, బీవీ.రమణ, జీవీ రమణ, బి.సూరిబాబు, ఆర్.వేణు, ఐద్వా నాయకులు బి.లక్ష్మి, ఆర్.శ్రీదేవి, వి.ఇందిర, కె.సాంబమూర్తి, రెడ్డి ఈశ్వరరావు, కె.ఈశ్వరరావు, మర్రి శ్రీనివాసరావు, పి.రాము తదితరులు పాల్గొన్నారు.


