● ఉత్కంఠ భరితంగా సాగిన విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు
విజయనగరం: విజయనగరం వేదికగా నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ క్రీడామైదానం ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన పోటీలు రెండవ రోజు మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగాయి. వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బుధవారం స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేయనున్నట్లు ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ఇదిలా ఉండగా రెండోరోజు మంగళవారం వాలీబాల్ క్రీడాంశంలో జరిగిన పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ పోటీలకు విజయనగరం, నెల్లూరు, విశాఖ, విజయవాడ జట్లు చేరుకున్నాయి. పోటీలను ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి పి.హరి, కార్యదర్శి మోహన్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్‌సభ్యులు వడివేలు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.
అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలు..
షాట్‌పుట్ విభాగంలో కె.శ్రీనివాస్ (ఎన్‌టీటీపీఎస్), ఎస్.పోతులయ్య (అనంతపురం), కె.స్వామి మణికంఠ (రాజమండ్రి)లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. జావెలిన్ త్రోలో ఏఎస్. రామకృష్ణ (అనంతపురం), కె.శ్రీనివాస్ (ఎన్‌టీటీపీఎస్), సీహెచ్‌బీవీవీ పుల్లారావు (ఏలూరు) విజేతలుగా నిలిచారు. డిస్క్‌త్రోలో ఆంజనేయులు (విజయనగరం), పి.కుమార్ (తిరుపతి), కె.శ్రీనివాస్ (ఎన్‌టీటీపీఎస్) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. లాంగ్‌జంప్‌లో ఆర్.బాలాజీ (తిరుపతి), కె.మణిబాబు (విజయనగరం), కె.భాస్కరరావు (శ్రీకాకుళం)లు సత్తా చాటగా..హైజంప్‌లో ఆర్.బాలాజీ (తిరుపతి), బీఎస్ ఇంతియాజ్ (అన్నమయ్య), కె.స్వామిమణికంఠ (రాజమండ్రి) ట్రిపుల్ జంప్‌లో ఆర్.బాలాజీ (తిరుపతి), కె.భాస్కరరావు (శ్రీకాకుళం), ఎన్.సాయికుమార్ (విజయనగరం) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. 5000 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎం.లక్ష్మణ్‌నాయక్ (అనంతపురం), ఎన్.వినీల్ (విజయవాడ)..10000 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎస్.జయరాజ్ (విజయనగరం), ఎన్.వినీల్ (విజయవాడ)లు..100 మీటర్ల పరుగు పోటీలో ఆర్.బాలాజీ (తిరుపతి), కేవీ నాగులు (విజయవాడ), ఎ.దివాకర్ (అనంతపురం) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 200 మీటర్ల పరుగు పోటీలో ఆర్.బాలాజీ (తిరుపతి), పి.అనిల్‌కుమార్ (విజయనగరం), కేవీ నాగులు (విజయవాడ), 400 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎం.లక్ష్మణ్ నాయక్ (అనంతపురం) కె.లివిబాబు (విజయవాడ), 800 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎస్.జయరాజ్ (విజయనగరం), ఎం.లక్ష్మణ్ నాయక్ (అనంతపురం)లు విజేతలుగా నిలిచారు.


