భగ్గుమన్న గురువులు | - | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న గురువులు

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

అడ్డగోలు కౌన్సెలింగ్‌పై.. భగ్గుమన్న గురువులు

సమీపంలో ఖాళీలున్నా..

మారుమూల ప్రాంతానికేనా?

ఎంటీఎస్‌ టీచర్ల కౌన్సెలింగ్‌లో ‘ఖాళీల’ మాయాజాలం ముందు 520 పోస్టులు చూపి... కౌన్సెలింగ్‌ సమయానికి 431కి పరిమితం కేటగిరీ –1, 2 ఖాళీలను తొక్కిపెట్టిన అధికారులు నిరసనలతో స్తంభించిన జెడ్పీ ప్రాంగణం 3 గంటలపాటు నిలిచిన ప్రక్రియ జీఓ 27ను తుంగలో తొక్కిన కూటమి సర్కార్‌ ఉపాధ్యాయుల గోడు వినని వైనం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు వద్దకు చేరిన పంచాయితీ మొండిగా ముందుకెళ్లిన విద్యాశాఖ అధికారులు

అడ్డగోలు కౌన్సెలింగ్‌పై..

విజయనగరం అర్బన్‌:

విజయనగరం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఎంటీఎస్‌ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌ తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, ఖాళీల ప్రదర్శనలో సాగిన మాయాజాలంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉపాధ్యా యులకు అనుకూలంగా తీసుకొచ్చిన జీఓ 27ను ప్రస్తుత ప్రభుత్వం తుంగలోకి తొక్కడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వందలాది మంది ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ కేంద్రం వద్దే బైఠాయించి ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటలపాటు కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తిగా స్తంభించి పోయింది.

రాత్రికి రాత్రే ఖాళీలు మాయం!

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని 431 మంది ఎంటీఎస్‌ ఉపాధ్యాయుల కోసం అధికారులు తొలుత (కౌన్సెలింగ్‌కు ముందు రోజు) 520 ఖాళీ పోస్టులను వెల్లడించారు. తీరా సోమవారం కౌన్సెలింగ్‌ ప్రారంభించే సమయానికి సీన్‌ రివర్స్‌ అయింది. 1:1 నిష్పత్తిలో కేవలం 431 ప్లేసులను మాత్రమే స్క్రీన్‌పై ప్రదర్శించారు. అందులోనూ ఉపాధ్యాయులకు అనూకూలంగా ఉండే కేటగిరీ–1, 2 ప్రాంతాల స్కూళ్లలోని ఖాళీలను పూర్తిగా తొక్కిపెట్టి, కేవలం మారుమూల ప్రాంతాలను మాత్రమే చూపించడంతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.

జెడ్పీ చైర్మన్‌కు గోడు వినిపించిన

ఉపాధ్యాయులు

కౌన్సెలింగ్‌ను బహిష్కరించిన ఉపాధ్యాయ ప్రతినిధులు నేరుగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును ఆయన చాంబర్‌లో కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ వైఎస్సార్‌సీపీ హయాంలో ఉపాధ్యాయులకు సమీప మండలాలు కేటాయించేలా తెచ్చిన జీఓ 27ను ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని విద్యాశాఖ అధికారులను చైర్మన్‌ ప్రశ్నించారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు స్పందిస్తూ రాష్ట్ర స్థాయి నిబంధనల మేరకు కౌన్సెలింగ్‌ జరుగుతోందని, జిల్లాస్థాయిలో తాము ఎలాంటి మార్పులు చేయలేమని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 431 మంది ఎంటీఎస్‌లకు కౌన్సెలింగ్‌ చేపట్టాలని, వారికి సరిపడే ఖాళీలను చూపించామన్నా రు. ఖాళీ పోస్టులలో 57 మాత్రమే క్లియర్‌ వేకెన్సీ ఉన్నాయని, మిగిలినవి క్లస్టర్‌ పరిధిలో క్లస్టర్‌ టీచర్‌ గా పనిచేస్తారన్నారు. 431 మందిలో 2008 డీఎస్సీ టీచర్లు 97 మందికాగా, మిగిలిన వారు 1998 డీఎస్సీకి చెందిన వారు.

గురువుల గోడు వినిపించుకోకుండానే...

ఉపాధ్యాయులు సుమారు మూడు గంటల పాటు కౌన్సెలింగ్‌ హాల్‌ను దిగ్భందించి నిరసన తెలిపిన ప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పట్టించు కోకుండా అదే మొండి వైఖరితో యథాతథంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియను ముగించడంతో ఉపాధ్యా య లోకం తీవ్ర నిరాశతో వెనుతిరిగింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంటీఎస్‌ ఉపాధ్యాయుల ఇబ్బందులను గుర్తించి, వారి నివాస ప్రాంతాలకు సమీపంలోని మండలాల్లోనే పోస్టింగ్‌ లు ఇచ్చేలా జీఓ నంబర్‌27ను అమలు చేశారు. దీనివల్ల ఎంతో మంది మహిళా సీనియర్‌ ఉపాధ్యాయులకు ప్రయాణ కష్టాలు తొలగాయి. ఇప్పుడు

ఆ పరిస్థితి లేదు.

ముందురోజు చూపించిన 520 ఖాళీలు రాత్రికి రాత్రే ఎలా మాయమయ్యాయి? సమీప మండలాల్లో స్పష్టమైన ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని ఎవరి కోసం దాచారు? గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ 27ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? కేవలం 1:1 నిష్పత్తిలోనే పోస్టులు చూపిస్తే మాకు నచ్చిన స్థానాన్ని ఎంచుకునే ‘కౌన్సెలింగ్‌ హక్కు’ ఎక్కడుంది? అంటూ కొందరు ఉపాధ్యాయులు అధికారులను ప్రశ్నించారు. దూర ప్రాంతాలకు వేయడంతో కన్నీటి పర్యంతమయ్యారు.

ఎంటీఎస్‌ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ ప్రతినిధులు ఉమ్మ డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఆయన చాంబర్‌లో కలిసి ఉపాధ్యాయులు తమ ఆదేదనను వ్యక్తపరిచారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో కేటగిరీ–1 ఓపెన్‌ వేకెన్సీలను విడుదల చేయకపోవడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సరైన స్పష్టత లేకపోవడం వల్ల అర్హత కలిగిన టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిస్కరించేలా చొరవచూపాలని వారు కోరారు. దీనిపై జెడ్పీ చైర్మన్‌ స్పందిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పూర్తి న్యాయబద్ధమైన రీతిలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగేలా కృషిచేస్తానని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement