పార్వతీపురం రూరల్: జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లై) గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్, ఉపాధ్యక్షుడు రాగోలు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. హమాలీలతో కలిసి పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతినెలా 10వ తేదీలోపు చెల్లించాల్సిన బిల్లులు (వేతనాలు) నెలలు గడుస్తున్నా రాకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఒకే బిల్లు జమయ్యేదని, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేరుతో రెండు వేర్వేరు బిల్లులు పడుతున్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే బిల్లులకు పీఎఫ్ జమకావడం లేదని, కార్మికులకు మునుపటిలాగే ప్రతినెలా 10లోపు ఒకే బిల్లును చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా పదవీ విరమణ పొందిన, మృతిచెందిన కార్మి కులకు ఇంతవరకు పీఎఫ్ సొమ్ము అందలేదని, వెంటనే ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని కోరారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డిపోలకు గతంలో మాదిరిగానే సరకులు సరఫరా చేయాలని, డిపోల సంఖ్యను కుదించరాదని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే ఆందోళ న ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
హమాలీలు రాగోలు ఫకీరు, రామారావు, జగదీ
ష్‌తో పాటు గుమ్మలక్ష్మీపురం, పాలకొండ, సీతంపేట, సాలూ రు, మక్కువ, పాచిపెంట, వీరఘట్టం తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.


