మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ తదితర 14 మున్సిపల్ సేవలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జారీచేసిన 975, 673 జీఓలకు వ్యతిరేకంగా పార్వతీపురంలో మున్సిపల్ కార్మికులు సోమవారం ఆందోళన చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అక్కడి
నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సింహాచలం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, కోశాధికారి గొర్లి వెంకటరమణ
మాట్లాడుతూ.. సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తీసుకువచ్చిన 279 జీఓను రద్దు చేసినట్లుగానే, ప్రస్తుత జీఓలను సైతం రద్దు చేసి ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని,
లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ నాయకులు పి.రాజశేఖర్, బి.సూరిబాబు, ఎన్.శంకరరావు, బి.రవి, ఎం.శివ, పి.గాంధీ, తిరుపతిరావు, మాధవ, తదితరులు పాల్గొన్నారు. – పార్వతీపురం రూరల్


