గిరిజన వర్సిటీ పనులు | - | Sakshi
Sakshi News home page

గిరిజన వర్సిటీ పనులు

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

తుది దశలో

గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన అనంతరం మరడాం సభకు వస్తున్న అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌)

దత్తిరాజేరు: కేంద్రియ గిరిజన విశ్వ విద్యాలయానికి 2023 ఆగస్టు 25వ తేదీన అప్పటి, ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన చోట శాశ్వత క్యాంపస్‌ పనులు రోజురోజుకు శరవేగంగా జరుగుతుండడంతో ఈప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే ఈ విద్యాదీపం నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉంచాలన్న కృతనిశ్చయంతో మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరలు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలిసి మంజూరు చేయించారు. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్‌లో తాత్కాలికంగా యూనివర్సిటీ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థను ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన సాలూరు పరిధిలోని మెంటాడ మండలం చినమేడపల్లి గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం మర్రివలస రెవెన్యూలలో 561.88 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ప్రకృతి రమణీయతతో చక్కని ప్రాంతంలో విద్యా సౌరభాలు విర బూయనున్నాయని ఈ ప్రాంతప్రజలు విద్యావేత్తలు, మేధావులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. 120 అడుగుల వెడల్పు రోడ్ల పనులతో పాటు తరగతి భవనాలు(అకడమిక్‌ బ్లాక్‌)పరిపాలన భవనం(అడ్మిన్‌ బిల్డింగ్‌)బాలికలు, బాలుర వసతి గృహాలు రానున్న 2027 విద్యా సంవత్సరానికి పూర్తి చేయడానికి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండడంతో పనులు చక,చకా జరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.

ఎక్కడ చూసినా నాయకుల కృషి పైనే చర్చ

ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు అయిన మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కలిసి వెనుకబడిన ప్రాంతంలో గిరిజన నియోజకవర్గానికి గిరిజన వర్సిటీ రావాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఒప్పించడంతో నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూనివర్సిటీ నిర్మాణం జరగడం శుభ పరిణామమని పలువురు ప్రశంసిస్తున్నారు. గిరిజన యూనివర్సీటికి వైజాగ్‌, భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌లు దగ్గరగా ఉండడం, విజయనగరం, కోమటిపల్లి, బొబ్బిలి రైల్వే స్టేషన్లు దగ్గరగా ఉండడంతో పాటు జల రవాణాకు కూడా వైజాగ్‌ దగ్గరవడంతో రవాణా కూడా సులభతరంగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం సులభంగా ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement