రెవెన్యూ రికార్డుల తప్పులపై రైతుల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ రికార్డుల తప్పులపై రైతుల ఆగ్రహం

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలకు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరిగినా పనులు కాకపోవడంతో కలెక్టరేట్‌ అర్జీలతో పోటెత్తింది. ఈ రోజు ఒక్కరోజే మొత్తం 252 వినతులు రావడం జిల్లాలో పెండింగ్‌ సమస్యల తీవ్రతకు అద్దం అడుతోంది. ఇందులో కేవలం రెవెన్యూశాఖకు సంబంధించే అత్యధికంగా 123 ఫిర్యాదులు రావాడం గమనార్హం.

రీ–సర్వే అభాసుపాలు..రైతుల ప్రదక్షిణలు

జిల్లాలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హుక్కు–భూ రక్ష (రీ–సర్వే) కార్యక్రమం క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోందనడానికి కలెక్టరేట్‌కు వస్తున్న ఫిర్యాదులే నిదర్శనం. రీ–సర్వే పూర్తయిన గ్రమాల్లో సరిహద్దు వివాదాలు తీవ్రమవడం, రికార్డుల్లో భారీగా తప్పులు దొర్లడం, వెబ్‌ల్యాండ్‌లో విస్తీర్ణ వ్యత్యాసాలు తలెత్తడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో మ్యుటేషన్లు, భూ వివాదాలు, రీ–సర్వే సమస్యలు భారీగా పెండింగ్‌లో ఉండడంపై కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆయన, ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో వివాదాస్పద భూములను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు.

1100 టోల్‌ ఫ్రీ దరఖాస్తులపై తప్పుడు నివేదికలు?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలోనూ అధికారులు చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జీదారులతో మాట్లాడకుండానే క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే నివేదికలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తునాయి. దీనిపై మాట్లాడిన తేదీ, సమయాన్ని రికార్డు చేయాలని కలెక్టర్‌ అధికారులను గట్టిగా హెచ్చరించారు.

అర్జీల వెల్లువ – శాఖల వారీగా వివరాలు

స్వీకరించిన 252 వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖ (భూసమస్యలు)కు 123, పంచాయతీరాజ్‌కు 24, డీఆర్‌డీఏకు 22, విద్యాశాఖకు 20, విద్యుత్‌ శాఖకు 5, గ్రామ సచివాలయాలకు 4, వైద్యారోగ్యశాఖకు ఒకటి ఇతర విభాగాలకు 41 అర్జీలు అందాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో జవాబుదారీతనం లోపించిందని, పెండింగ్‌లో ఉన్న అర్జీలను ఇప్పటికై నా కాలపరిమితిలో పూర్తి చేసి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ అధికారులను మందలించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌.సత్తిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఎస్పీ పీజీఆర్‌ఎస్‌ కు 29 ఫిర్యాదులు

విజయనగరం క్రైమ్‌: స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 29 ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఎస్పీ దామోదర్‌ పరిశీలించి సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి, సమస్యలను వివరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డ డీసీఆర్మీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు ప్రభావతి, పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో పెండింగ్‌ దరఖాస్తుల గుట్టలు

అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌

తీవ్ర అసంతృప్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement