● ప్రారంభమైన ఇంటర్ సర్కిల్ వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు
విజయనగరం: ప్రజలకు అవసరమైన అత్యవసరమైన సేవల్లో ఒక్కటైన విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మానసిక ఆరోగ్యం ముఖ్యమని, అది క్రీడల ద్వారానే సాధించగలమని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ అండ్ హెచ్‌ఆర్ డైరెక్టర్ టి.వనజ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ నేతృత్వంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఇంటర్ సర్కిల్ పురుషుల వాలీబాల్, అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలను సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడామైదానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆమె వివిధ ఆపరేషన్ సర్కిల్స్ నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వాలీబాల్ పోటీలను తొలి సర్వ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే ఉద్యోగులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి విజయవంతం చేయాలని కోరారు. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు మాట్లాడుతూ వివిధ సర్కిల్స్ నుంచి పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసిన క్రీడాకారులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు.
23 జట్లు... 350 మంది క్రీడాకారులు..
ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సర్కిల్స్ నుంచి 23 జట్లకు చెందిన 350 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం రెండు క్రీడాంశాల్లో నిర్వహించే పోటీల్లో వాలీబాల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించనున్నారు. అదేవిధంగా అథ్లెటిక్స్ క్రీడాంశంలో పాల్గొనే క్రీడాకారులకు రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు 24వ తేదీన బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరా వు, విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఈఈ పి.హరి, ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు వడివేలు తదితరులు పాల్గొన్నారు.


