పార్వతీపురం: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్(ఎఫ్‌ఏసీ), డీఆర్‌ఓ కె.హేమలత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీతోపాటు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్‌డీఓ కె.మాధురితో కలిసి వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆమె 103 అర్జీలను స్వీకరించారు. వాటిలో సాధారణ అర్జీలు 67 కాగా రెవెన్యూ అర్జీలు 26 ఉన్నాయి. గృహనిర్మాణ గ్రాంట్లు, ఆరోగ్య కార్యకర్త పోస్టు భర్తీ, భూసమస్యలు, 1బి పాస్‌బుక్, పీఎం కిసాన్ పథకం, ఇంటి స్థల పట్టాల మంజూరువంటి అంశాలపై అర్జీలు అందగా, వాటికి నాణ్యమైన పరిష్కారంతో త్వరగా పూర్తిచేయాలని అధికారులకు జేసీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించాలి
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ–సమస్యల విచారణ క్రమంలో భాగంగా ఆయన ప్రతి పిటిషనర్‌తో ముఖాముఖి మాట్లాడి, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వేదికలో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ వంచనలు, ప్రేమ పేరిట మోసాలకు సంబంధించిన మొత్తం 8 ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ, తక్షణమే ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. ఆయా ఫిర్యాదుల పూర్వాపరాలను నిశితంగా పరిశీలించి, అవి వాస్తవాలని తేలితే చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నిర్దిష్ట గడువు లోగా సమస్యలను పరిష్కరించి, తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్సై అశోక్ చక్రవర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


