● జిల్లా వృత్తి విద్య అధికారి
ఎస్.తవిటి నాయుడు
గజపతినగరం: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి, రీజనల్ ఇన్‌స్పెక్షన్ అధికారి ఎస్.తవిటి నాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానురాను గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యూ అడ్మిషన్‌ల సంఖ్య ఎందుకు తగ్గుతూ వస్తోందని అలా తగ్గడానికి గల కారణాలు ఏమిటని స్థానిక ఉపాధ్యాయ సిబ్బందిని ఆరా తీశారు. గజపతినగరంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల హవా ఎక్కువగా ఉందని, దీంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ కళాశాలలో చేర్పించేందుకు ముందుకు రావడం లేదని, విద్యార్థులు కూడా ప్రైవేట్ కళాశాలల వైపే మొగ్గు చూపుతున్నారని సిబ్బంది చెప్పారు. అందువల్ల ప్రభుత్వ కళాశాలలు మరుగున పడాల్సి వస్తోందని చెప్పడంతో దీనికి ఆయన స్పందించి ఇక నుంచి అలా జరగకుండా ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయ సిబ్బంది గడపగడపకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అడ్మిషన్‌ల సంఖ్య పెరిగేలా చూసుకోవాలని ఆదేశించారు.అలాగే న్యూ అడ్మిషన్లను ఎలా చేయాలి? విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి? ఎలా మోటివేట్ చేయాలన్న అంశాలపై ఉపాధ్యాయ సిబ్బందికి తవిటి నాయుడు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రకాశ రావు పట్నాయక్‌తో పాటు పలువురు ఉపాద్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


