నెల్లిమర్ల: స్థానిక సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళా శాల విద్యార్థిని షేక్ షేరున్నిసా ప్రతిష్టాత్మక అమరావతి వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 100% ఉచిత ఇంజినీరింగ్ సీటు సాధించి రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. దీంతో వీఐటీ సంస్థ గ్రామీణ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ’స్టార్స్’ పథకం కింద ఆమెకు ఈ ఉచిత సీటును కేటాయించారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్ల ఇంజినీరింగ్ ట్యూషన్ ఫీజుతో పాటు హాస్టల్, భోజన వసతి ఖర్చులను కూడా వీఐటీ సంస్థే పూర్తిగా భరించనుంది. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉచిత సీటు సాధించిన షేరున్నిసాను, ఆమె తల్లిదండ్రులను కళాశా ల ప్రిన్సిపాల్ మజ్జి సత్యనారాయణ, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.
పేకాట శిబిరంపై దాడి: ఆరుగురి అరెస్ట్
పార్వతీపురం రూరల్: పట్టణంలోని కోడిగుడ్ల వీధిలో సాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.23,900 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కె.రాజేష్ తెలిపారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఉంచామని, సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


