● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసిన తొలి జిల్లాగా పార్వతీపురం మన్యం రికార్డు సృష్టించిందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో కోటి మందితో నిర్వహించిన యోగా ప్రపంచ రికార్డులో జిల్లా ప్రజలు భాగస్వాములయ్యారని చెప్పారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడి లేని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని సూచించారు. అనంతరం ‘యోగాంధ్ర’ పోటీల్లో రాష్ట్రస్థాయిలో 12 పతకాలు సాధించిన విజేతలకు, జిల్లాస్థాయి ప్రతిభావంతులకు కలెక్టర్, ఎస్పీ జ్ఞాపికలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.హేమలత, ఆర్డీఓ కె.మాధురి, మున్సిపల్ కమిషనర్ డి.పావని, ఆయుష్ వైద్యాధికారి టి.హేమాక్షి, నోడల్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
మీకోసం వెబ్ సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీలు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారవేదికలో(పీజీఆర్‌ఎస్) అందజేసే అర్జీల వివరాలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల అభ్యర్థన మేరకు ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని, వాటి స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
పైనాపిల్ @ 9
సీతంపేట: సీతంపేట మార్కెట్‌లో పైనాపిల్ ధర ఆదివారం అమాంతం పతనమైంది. ఒక్కో పండును రూ.9కి గిరిజనులు విక్రయించారు. గత వారం రూ.18 కి ఒక్కో పండు అమ్మకాలు జరపగా ఈ వారం సగానికి ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా పైనాపిల్ మార్కెట్‌కు రావడం, దీనికి తోడు భోరున వర్షం కురవడంతో ధర పడిపోయినట్లు గిరిజనులు తెలిపారు.
శృంగవరపుకోట: ‘అడవి బిడ్డలమైన మాకు అక్షర జ్ఞానం కల్పించండి’ అంటూ మండలంలోని దారపర్తి పంచాయతీ కురిడి గ్రామానికి చెందిన విద్యార్థులు కలెక్టర్‌ను వేడుకున్నారు. గిరిశిఖర గ్రామమైన కురిడిలో 100 కుటుంబాలు ఉండగా 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరంతా గ్రామంలో పాఠశాల లేకపోవడంతో నిత్యం ఆరు కిలోమీటర్లు కొండలు, గుట్టలు, వాగులు దాటి గూనపాడు గ్రామంలోని పాఠశాలకు వెళ్తున్నారు. నిత్యం అంత దూరం నడవలేక వారంలో రెండు మూడు రోజులు మాత్రమే వెళ్లగలుగుతున్నారు. మా పిల్లల విద్యాభ్యాసానికి వీలుగా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయండి లేదా మాస్టర్‌ను పంపి తమ బిడ్డలకు అక్షరాలైనా నేర్పించండి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. విద్యా ర్థుల వెతలను గుర్తించిన గిరిజన సంఘం నేత జె.గౌరీష్ దీన్ని వీడియో చేసి కలెక్టర్‌ను వేడుకుంటున్న దృశ్యాలను కలెక్టర్‌కు, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం ప్రతినిధులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.


