● కడుపునొప్పి, పిట్స్ రావడంతోనే... ● ఆస్పత్రికి తరలించినా.. ఫలితం దక్కలేదు.. ● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ● బక్కునాయుడుపేట కస్తూర్బాలో కలకలం
వేపాడ:
మండలంలోని బక్కునాయుడుపేట కస్తూర్బా బాలికల విద్యాలయంలో తొమ్మిది తరగతి చదువుతు న్న వారాది బిందు కడుపునొప్పి, పిట్స్ రావడంతో మృతి చెందిన సంఘట న కలకలం రేపింది. బిందు మృతికి సంబంధించి ఉపాధ్యాయులు, పీహెచ్‌సీ వైద్యులు అందించిన వివరాలు.. మండలంలోని జాకేరు గ్రామాని కి చెందిన వారాది గణపతి, మంగ దంపతుల కుమార్తె బిందు. బక్కునాయుడుపేట కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో బిందు కడుపునొప్పిగా ఉందని తోటి విద్యార్థులకు చెప్పగానే నైట్ డ్యూటీలో ఉన్న మేడమ్ రోహిణీకి సమాచారం ఇచ్చారు. మేడమ్ వెళ్లిచూడగా కడుపునొప్పితో పాటు నోటి నుంచి కొంచెం సొంగలు రావడంతో ఎంపీహెచ్‌డబ్ల్యూ బి.అరుణ వచ్చి చూశారు. పిట్స్‌లా ఉందని వెంటనే వేపాడ పీహెచ్‌సీకి ఆటోలో తరలించారు. బిందు తల్లిదండ్రులకు, ప్రిన్సిపాల్‌కు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చారు. వేపాడ ఆస్పత్రికి రాగానే స్టాఫ్‌నర్సు తనిఖీ చేసి సీరియస్‌గా ఉందని ఎస్.కోట తరలించేందుకు అంబులెన్స్‌లో ఎక్కించి ప్రధమ చికిత్స అందించే సమయానికి బిందు మరణించినట్టు గుర్తించారు.
దీంతో ఆస్పత్రికి చేరుకున్న బిందు తల్లిదండ్రులు తమ గ్రామం జాకేరుకు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ కిరణ్మయి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈఓ మాణిక్యంనాయుడు, జీసీడీఓ మాలతి, జీసీడీఓ చైర్మన్ సన్యాసిరాజు జాకేరు వచ్చి తమ సంతాపం తెలిపారు. తల్లిదండ్రులను ఓదార్చారు. బిందుకు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
15 రోజులు క్రితమే...
మృతి చెందిన బిందు 15 రోజుల కిందటే రజస్వల కావడంతో ఈ నెల 7వ తేదీన జాకేరులో వాణి ఫంక్షన్ చేశారు. ఇంతలోనే బిందు మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. బిందు తండ్రి గణపతి కేజీబీవీ పాఠశాల ఎస్‌ఎంసీలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బిందు మృతిపై వేపాడ పీహెచ్‌సీ వైద్యాధికారిణి డా.ప్రేరణ వద్ద ప్రస్తావించగా తాను యోగా వద్ద ఉన్నానని, విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సు తనిఖీ చేయగా అప్పటికే పల్స్ పడిపోయినట్టు గుర్తించి ఎస్.కోట తరలించేందుకు అంబులెన్స్ సిద్ధం చేశారని, ప్రధమ చికిత్సకు సిద్ధం చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. కేజీబీవీ సిబ్బంది బిందు దహన ఖర్చులకుగాను కుటుంబీకులకు రూ.10వేలు అందజేశారు. బిందు మృతితో కేజీబీవీలోని తోటి విద్యార్థినులు కలత చెందారు. కన్నీరుమున్నీరై విలపించారు.


