రామభద్రపురం: మండలంలో 2015–16లో జరిగిన నీరు–చెట్టు అక్రమాల పాపం పండింది. అక్రమాలు చేసేసి..అంతలోనే గట్టెక్కిపోయాం అనుకున్న అప్పటి అధికారపార్టీ నాయకుల గుండెల్లో మళ్లీ రైళ్లు పరుగెడుతున్నాయి. రామభద్రపురం మండలంలో ఉపాధిహామీ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ.5.7కోట్లతో 102 పనులు చేపట్టారు. అయితే అప్పట్లో అధికారం అండతో పాటు జలవనరుల శాఖ అధికారుల సహకారంతో పనులు చేయకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లులు చేసుకోవడం..తక్కువ పనిచేసి ఎక్కువగా నమోదుచేయడం..తూతూ మంత్రంగా పనులు చక్కబెట్టేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించి మొత్తం 102 పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, కొన్ని పనులు పూర్తిగా చేయకుండానే చేసినట్లు, మరికొన్ని పనులు నాణ్యతలేకుండా చేయడం, చెక్‌డ్యాంలు,మదుములు, చప్టాలకు టెక్నికల్ మంజూరు లేకుండా పనులు జరిపినట్లు, నాశిరకంగా నిర్మించడంతో పాటు ఉపయోగంలేని పనులు చేయడం, పోర్జరీ సంతకాలు చేసినట్లు గుర్తించారు.అలాగే మొత్తం నిధులలో సుమారు రూ.2.40 కోట్ల వరకు అవకతవకలు జరిగి నిధులు స్వాహా అయినట్లు నిర్ధారించారు, అప్పట్లో మండలంలో మొత్తం 22 పంచాయతీల చెక్ పవర్ల రద్దు, ఇరిగేషన్ అధికారులతో పాటు మరికొంత మంది మండల అధికారులు 24 మందిపై సస్పెన్సన్ వంటి అక్రమాలతో రామభద్రపురం మండలం రాష్ట్రంలోనే చర్చనీయాంశమవడం తెలిసిందే.
ఏసీబీ అధికారుల నోటీసులు
అప్పట్లో విజిలెన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడిన వారిని విచారణ కూడా చేశారు. అధికారం అండదండలు ఉండడంతో పూర్తిగా విచారణ జరగలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు ఈ కేసును ఏసీబీకి అప్పగించారు.సుమారు 8 ఏళ్లు అవడంతో అప్పటి అక్రమాలపై మరేమీ ఉండదు..గట్టెక్కిపోయాం అనుకున్నారు. కానీ వదల బొమ్మాళీ..నిన్నొదలా అన్నట్లు అక్రమాలకు పాల్పడినట్లు అభియోగం ఉన్న అప్పటి జలవనరుల శాఖ అధికారులతో పాటు నాయకులకు కూడా నాలుగు రోజుల క్రితం ఏసీబీ అధికారుల నుంచి నోటీసులు వచ్చినట్లు తెలిసింది. అప్పట్లో ఎందుకు అక్రమాలకు పాల్పడాల్సి వచ్చింది? స్వాహా చేసినట్లు విజిలెన్స్ బృందం నిర్ధారించిన సొమ్ము తిరిగి చెల్లించాలని, ఎప్పటికి చెల్లిస్తారో చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఏఈలతో పాటు నాయుడువలస, తారాపురం, కోటశిర్లాం, మామిడివలస గ్రామాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసు కేసులు నమోదైనట్లు సమాచారం.
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
2015–16లో నీరు చెట్టు పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నాయకులు
రూ.2.40 కోట్లు అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారుల నిర్ధారణ
కేసు ఏసీబీకి అప్పగింత
అప్పట్లో అక్రమాలకు పాల్పడిన
వారందరికీ ఇప్పుడు ఏసీబీ నోటీసులు


