● ఒకొకక్కరికి రెండేసి పంచాయతీల విధులు
● ఒత్తిడి గురవుతున్న కార్యదర్శులు
డెంకాడ: గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందించే పంచాయతీలను కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ప్రతి కార్యదర్శి రెండేసి పంచాయతీల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యలో ఏవరైనా సెలవు పెడితే ఎవరో ఒకరికి ఆ పంచాయతీ బాధ్యతులు అప్పగిస్తే మూడు పంచాయతీల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్‌లకు పదవీ కాలం పూర్తి కాగా ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో సాగుతున్నాయి. ఉదయం ఆరున్నర, ఏడు గంటల నుంచి ఆయాగ్రామ పంచాయతీలకు కార్యదర్శులు చేరుకుని సేవలందించాల్సిన పరిస్థితి ఉండడంతో అదనపు పంచాయతీ బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. వీటికి తోడు రాజకీయ ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. నిత్యం రాజకీయ చట్రంలో పని చేయాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఎంత ఒత్తిడి ఉన్నా నేరుగా బయటకు తమ బాధను చెప్పులేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇన్‌చార్జ్‌ల పాలనలో..
డెంకాడ మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 17 గ్రామ సచివాలయ కేంద్రాలు. మండల కేంద్రమైన డెంకాడ గ్రామ సచివాయం కూడా ఇన్‌చార్జ్ కార్యదర్శితోనే కాలం వెళ్లదీస్తున్నారు. మోదవలస, చింతలవలస–2, రఘుమండ, గుణుపూరుపేట,సింగవరం గ్రామ సచివాలయాలు ఇన్‌చార్జ్ పాలనలోనే నడుస్తున్నాయి. డి.తాళ్లవలస, ఆకులపేట, డి.కొల్లాం, పంచాతీయలకు కూడా కార్యదర్శులు లేరు. గుణుపూరు కార్యదర్శి సెలవుపై వెళ్లడంతో అది కూడా ఇన్‌చార్జ్ పాలనలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదవలస సచివాలయంలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఆ పంచాయతీ బాధ్యతలు మాకు వద్దని మండల అధికారులను కార్యదర్శులు వేడుకుంటున్నారు.
ఉదయం ఆరున్నర నుంచే
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనుల్లో భాగంగా రిక్షాబళ్లపై చెత్తను సేకరిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి వారిని పర్యవేక్షించాలి. అక్కడ వారితో తెల్లవారుజామున ఆరున్నర,ఏడు గంటలకు ఫొటో తీసి పైవారికి పెట్టాలి. ఇక్కడి నుంచి పంచాయతీ కార్యదర్శి విధులు ప్రారంభమవుతున్నాయని వారు చెబుతున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు సరఫరా, వీధి దీపాల పనితీరు తదతర వాటిపై నిత్యం ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ ప్రజలకు వస్తాయి. వాటిలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలి. లేకపోతే పంచాయతీ కార్యదర్శి పని తీరు సక్రమంగా లేదని పైవారు భావిస్తారట. దీంతో వాటి కోసం నిరంతరం పని చేయాల్సి ఉంది. కొందరు కార్యదర్శులను బీఎల్‌ఓలుగా కూడా నియమించారు. వీరు ఓటర్ల సవరణ ప్రక్రియను పరిశీలించాలి. వాటికి తోడు సెన్సెస్ ప్రక్రియ వేరే చెప్పనక్కర్లేదు. గ్రామ సచివాలయంలో ప్రజలకు నిరంతరం అందించాల్సిన సేవలు అందించాల్సిన బాధ్యతల్లో పంచాయతీ కార్యదర్శి పాత్ర చాలా కీలకమని వారు చెబుతున్నారు. ఇన్ని పనులు ఒక పంచాయతీలో నిర్వహించిన కార్యదర్శులకు మరిన్ని పంచాయతీల బాధ్యత అంటే చాలా ఒత్తిడి గురిచేయడమే అని ఆవేదన చెందుతున్నారు.అధికారులు అన్ని పంచాయతీలకు కార్యదర్శులను నియమించి మాపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు.
పంచాయతీ కార్యదర్శులు లేరు
మండలంలో పది గ్రామ సచివాలయాలు, పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు లేరు. దీంతో ఉన్నవారికే పది పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నాం. మోదవలస పంచాయతీలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.ఇదో సమస్యగా మారింది. ఉన్నత వారితో పంచాయతీల్లో ఇబ్బందులు లేకుండా పని చేయిస్తున్నాం.
దేవానంద్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ, డెంకాడ


