విజయనగరం అర్బన్: స్థానిక ఎన్జీవో హోమ్‌లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) ఏపీ 15వ మహాసభలు ఆదివారం నిర్వహించారు. కామ్రేడ్ పెద్దింటి సూర్యానారాయణ ప్రాంగణం నామకరణంతో జరిగిన ఈ సభ ప్రాంగణాన్ని బీవీఎస్ పట్నాయక్ ప్రారంభించారు. ఆనాటి చారిత్రాత్మక శ్రీకాకుళం గిరిజన ఉద్యమ కాలం నుంచి నేటి వరకు వివిధ వర్గాల ప్రజాపోరాటాలకు, హక్కుల పరిరక్షణకు ఓపీడీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తోందని వక్తలు తెలిపారు. అనంతరం ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారెడ్డి నివేదికను సభలో ప్రవేశపెట్టారు. సమాజంలోని పలు కీలక సమస్యలపై ఈ సభలో చర్చించి, చేసిన తీర్మానాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. గిరిజన, గ్రామీణ, పట్టణ పేద ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రాష్ట్రంలో కొనసాగుతున్న భూస్వామ్య దందాలు అరికట్టాలని, పేదలందరికీ ఉచిత, నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓపీడీఆర్ అధ్యక్షుడు డాక్టర్ జితిన్ తదితరులు పాల్గొన్నారు.


