● పెట్టుబడి సాయం నిల్
● జిల్లాలో 70 శాతం కౌలు రైతులే..
● రెండేళ్లుగా సాయం కోసం ఎదురు చూపులు
● పట్టించుకోని చంద్రబాబు సర్కార్
కౌలు
రైతుకు
పాలకొండ రూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులను రెండేళ్లుగా విస్మరిస్తోంది. వ్యవసాయమే జీవనాధారమై భూ యజమానుల నుంచి కౌలుకు తీసుకున్న భూమిలో రెక్కల కష్టాన్ని నమ్మి సేద్యం చేసే కౌలు రైతులకు ప్రభు త్వం మొండిచేయి చూపుతోంది. అన్నదాత సుఖీభవ లబ్ధి చేకూరకుండా చేస్తోంది. రెండేళ్లుగా పెట్టుబడి సాయం అందుతుందని ఆశగా చూస్తున్న వీరికి ఈ ఏడాదీ అన్యాయమే చేసింది. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించడంతో పాటు వ్యవసాయ సంబంధిత సంక్షేమ లబ్ధిని అందిస్తామని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం రూ.20వేలు అందిస్తామని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావచ్చింది. తాజాగా ఈ ఏడాది కూడా ఖరీఫ్‌కు సంబంధించి పెట్టుబడి సాయం విడుదల చేసింది. అందులో కౌలు రైతులకు మాత్రం రిక్తహస్తమే చూపింది.
వాస్తవానికి..
సాగు విషయానికి వస్తే జిల్లాలో భూ యజమానుల కంటే కౌలు రైతులు కీలకంగా ఉన్నారు. 15 మండలాల్లో దాదాపు రెండు లక్షలకు పైబడి రైతులు సాగుపై ఆధారపడుతున్నారు. వీరిలో పీఎం కిసాన్ పొందుతున్న వారు దాదాపు లక్షకు పైగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి అందించిన రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన 80 శాతం వరకూ కౌలు రైతులు ఉన్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, వ్యవసాయ రుణాలు అందిస్తామని చెప్పిన యంత్రాంగం శతశాతం సఫలీకృతం కాలేదని సదరు రైతులు వాపోతున్నారు. వాస్తవానికి వ్యవసాయంపై ఆధారపడే వీరికి ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాలు, కౌలు రైతులు ధీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే 2011లో కౌలు రైతుల చట్టం వచ్చింది. 2019లో ఆ చట్టాన్ని సవరిస్తూ భూ యజమానుల అంగీకారంతోనే కౌలు కార్డులు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులందరికి సంక్షేమ పథకాలు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అధికారంలోకి వస్తే నూతన చట్టం తెచ్చి కౌలు రైతులను అన్నివిధాల ఆదుకుంటామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక దానికి భిన్నంగా వ్యవహరిస్తూ కౌలు రైతుల సంక్షేమాన్ని పక్కకు నెట్టింది. అన్నదాత సుఖీభవ లబ్ధి కౌలు రైతుకు ఇచ్చే ఉద్దేశం కూటమికి లేదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ లబ్ధిని జిల్లా వ్యాప్తంగా 1,22,260 మందికి అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ ద్వారా కేంద్రం నుంచి రూ.21.9 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్రం నుంచి రూ.61.13 కోట్లు వంతున మొత్తంగా రూ.83.03 కోట్లు జమ చేయనున్నారు. వీరిలో ఒక్క కౌలు రైతు లేడు. జిల్లా వ్యవసాయ యంత్రాంగం లెక్కల మేరకు కేవలం 9600 మంది మాత్రమే కౌలు రైతులు ఉంటారని, వీరిలో దాదాపు 2వేల మంది పూర్తిగా భూమి లేని రైతులని చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదు. వారికి అందిస్తామన్న పెట్టుబడి సాయం గత రెండేళ్లగా అందించటం లేదు. గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాల ఊసే లేదు. ఏటా కౌలు రైతులు తమ చేతి సొమ్ములు, అప్పులు చేసి సాగు చేస్తున్నారు. నష్టం వస్తే వారే మళ్లీ అప్పులు చేసి భరిస్తున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం కంటితుడుపు మాటలతో సరిపెడుతుంది. కూటమి పేరిట కలసి ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కేవలం భూ యజమానులకు తప్పితే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను చిన్నచూపు చూస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కౌలు రైతుకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి సర్కారుకు కౌలు రైతులు, వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యుల ఆవేదనను గుర్తించాల్సి ఉంది. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం.
– కిమిడి రామ్మూర్తినాయుడు,
కౌలు రైతుల సంఘం నాయకుడు


