పాఠశాలగా వైటీసీ..! | - | Sakshi
Sakshi News home page

పాఠశాలగా వైటీసీ..!

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

పద్మాపురం ఆశ్రమ పాఠశాలను వైటీసీకి మార్పు చేస్తాం..

సాలూరు: నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ తరగతుల నిర్వహణకు, గిరిశిఖర గర్భిణులకు వసతిగృహ కేంద్రంగా ఉపయోగించే యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (వైటీసీ) కనుమరుగు కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైటీసీ నిర్వహణపై కూటమి ప్రభుత్వంలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక్కడి సిబ్బందికి జీతాలు చెల్లించలేక, గిరిజన గర్భిణుల వసతి భారం భరించలేక మూసివేసేందుకు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాచిపెంట మండలం కేంద్రంలోని పద్మాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరడంతో... సాలూరు వైటీసీకి మార్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఐటీడీఏ అధికారులు వైటీసీని పరిశీలించారు. సోమవారం నుంచి ఏ రోజైనా వైటీసీకి పద్మాపురం పాఠశాలను తరలించవచ్చని అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. పద్మాపురం సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 240 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా ఇక వైటీసీ భవనాల్లో విద్యాభ్యసన చేయనున్నారు.

ఆందోళనలో సిబ్బంది

గిరిశిఖర గర్భిణులు వసతిగృహంలో ఏళ్లతరబడి సేవలందిస్తున్న సిబ్బంది తమ భవిష్యత్‌ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జీతాల సమస్యలు ఎదురైనా నాటి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో జెడ్పీ నుంచి నిధులు తీసుకొచ్చి వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. నేడు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సంధ్యారాణి గిరిశిఖర గర్భిణుల వసతిగృహానికి నూతన జవసత్వాలు తీసుకొస్తారని భావిస్తే నిర్వీర్యం దిశగా అడుగులు వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు సాలూరు ఏరియా ఆస్పత్రిలో గిరిశిఖర గర్భిణులను చేర్పించాలని అధికారులు సూచిస్తున్నా, అక్కడికి వెళ్లేందుకు గర్భిణులు నిరాసక్తి చూపుతున్నారు.

పాచిపెంట మండలంలో పద్మాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. వారి ఆదేశాల మేరకు సాలూరు పట్టణంలో వైటీసీకి ఆశ్రమ పాఠశాలను సోమవారం నుంచి ఏ రోజైనా మార్పుచేసే అవకాశం ఉంది.

– విజయశాంతి, ఐటీడీఏ డీడీ, పార్వతీపురం

విద్యాలయంగా మారబోతున్న ఉపాధి, వసతి కేంద్రం

పద్మాపురం సంక్షేమ పాఠశాల సాలూరు వైటీసీకి తరలింపునకు సన్నాహాలు

వైటీసీ భవితవ్వంపై నీలినీడలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement