పింఛన్‌ రాదు.. టెన్షన్‌ తీరదు..! | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ రాదు.. టెన్షన్‌ తీరదు..!

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

పింఛన్‌ రాదు.. టెన్షన్‌ తీరదు..!

ఎంతకాలం ఇలా మోసగిస్తారు...

వీరఘట్టం: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు... రెండేళ్లుగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మంజూరవుతుందా.. బతుకుకు భరోసా దొరుకుతుందా అని ఆశపడుతున్నారు. దరఖాస్తులు పట్టుకుని సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం శూన్యమే. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన బడుగువర్గాలందరికీ పింఛన్‌ ఇస్తామని చెప్పారని, ఇప్పుడు కనీసం వితంతువులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతీ ఆరునెలలకు ఒకసారి అర్హులకు పింఛన్లు మంజూరు చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. నేడు పింఛన్‌ ఠంచన్‌గా రాదన్న పరిస్థితి నెలకొందన్నారు. దరఖాస్తులు స్వీకరించకుండానే వితంతువు పింఛన్‌ కేటగిరీలో రాష్ట్రంలో 2.20 లక్షల మంది ఉన్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ పరిస్థితి...

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేలకు పైబడి వితంతువులు, 60 ఏళ్లు నిండిన వారు సుమారు 40 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరితో పాటు 50 ఏళ్లు నిండిన వారు 1,32,512 మంది ఉన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షలకు పైగా లబ్ధిదారులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

రెండేళ్లుగా పింఛన్‌ కోసం ఎదురుచూపు

కొత్తగా ఒక్కరికీ మంజూరు కాని పింఛన్‌

వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులకు తప్పని ఆర్థిక కష్టాలు

జిల్లాలో పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నవారు 1.75 లక్షల మంది

కొత్త పింఛన్లకు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామంటూ కూటమి నాయకులు ప్రకటనలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టారు. తీరా దరఖాస్తులు పట్టుకుని సచివాలయాలకు వెళ్లిన లబ్ధిదారులను వెనుకకు పంపించారు. ఉసూరుమనిపించారు. కూటమి నేతలు ఇంకా ఎంతకాలం మోసగిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అందిస్తామని చేసిన హామీ అమలుపై ప్రజలకు సమాధానం చెప్పండి.

– విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement