జల రక్షణ.. గ్రామ స్వచ్ఛతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జల రక్షణ.. గ్రామ స్వచ్ఛతే లక్ష్యం

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

పరిశుభ్రతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం

కృష్ణపల్లిలో కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్‌

పార్వతీపురం రూరల్‌ : జిల్లాలో ఆక్రమణల బారిన పడుతున్న చెరువులను కాపాడటంతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడమే లక్ష్యంగా యంత్రాంగం ముందడుగు వేస్తోందని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అన్నారు. మండలం కృష్ణపల్లిలో ‘జల రక్షణ’, ’స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆక్రమణల వల్ల విస్తీర్ణం తగ్గిన 2,816 చిన్న నీటి పారుదల చెరువులను జిల్లా వ్యాప్తంగా గుర్తించామన్నారు. వీటికి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పక్కాగా హద్దులు నిర్ధారించి, ఉపాధి హామీ పథకం ద్వారా కందకాలు తవ్వడంతో పాటు పెగ్‌మార్కింగ్‌ చేయనున్నట్టు చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఆక్రమణలకు అడ్డుకట్ట పడటమే కాకుండా, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. ఈ పనులను రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీ, ఉపాధి హామీ శాఖల సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి

అనంతరం కృష్ణపల్లిలో పరిసరాలను శుభ్రపరిచిన కలెక్టర్‌.. స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు పరిసరాల పరిశుభ్రతను తమ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ‘స్వచ్ఛ పార్వతీపురం’ సాధనకు ప్రజ లు, విద్యార్థులు, యువత, మహిళా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేలా అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. అనంతరం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రపై అధికారులు, సిబ్బందితో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాల్లో ఆర్‌డీఓ కె.మాధురి, డీపీఓ ఎస్‌.రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈవీఎం గోడౌన్‌లో పటిష్ట భద్రత

పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్‌ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌనన్‌ను తనిఖీ చేశారు. గదులకు వేసిన సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, లాగ్‌బుక్‌ల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. తనిఖీల్లో జాయింట్‌ కలెక్టర్‌ (ఎఫ్‌ఏసీ) కె.హేమలత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement