విజయనగరం రూరల్: స్థానిక జేఎన్‌టీయూ జీవీలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ – జీవీ ఉప కులపతి (వీసీ) వి.వి.సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ, చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అనంతరం వీసీ సుబ్బారావు మాట్లాడుతూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో సమాజాభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. రిజిస్ట్రార్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరిశుభ్రత నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని అన్నారు. విశ్వవిద్యాలయాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఆచార్యులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


